ట్రెండీ స్టోరి: థియేట‌ర్ల‌లో ఈ దందాలు ఆగేదెలా?

Update: 2022-11-24 16:30 GMT
నేను జీడి (నువ్వుల‌తో చేసిన‌ది) కొనుక్కోడానికి 10 పైస‌లు ఖ‌ర్చు పెట్టేవాడిని రోజూ. ఎల్.కే.జీ యుకేజీ ఒక‌టో క్లాస్ ఏజ్ లో 1990లో సంగ‌తి..

5వ త‌ర‌గ‌తికి వ‌చ్చేప్ప‌టికి అది 20 పైస‌లు అయ్యింది.. అంటే రెట్టింపు అవ్వ‌డానికి ఐదేళ్లు ప‌ట్టింది. 1995 త‌ర్వాత అదే జీడి 30  పైస‌లు అవ్వ‌డానికి మ‌రో ఐదేళ్లు ప‌ట్టింది. 2010 నాటికి రూ.1 రూపాయి ధ‌ర‌కు చేరుకుంది. ఇప్పుడు అదే జీడి కొనాలంటే ఏకంగా రూ. 10 రూపాయ‌లు పెట్టాలి. ఈ 10 ఏళ్ల‌లో ఎన్ని రెట్లు పెరిగింది అంటే..? ప‌ది రెట్లు పెరిగింది. కానీ అప్ప‌టి జీడి క్వాలిటీ ఇప్ప‌టి జీడిలో లేదు. నాశిర‌కం జీడి తినాలి.

కానీ ఇప్పుడు అదే నాశిర‌కం జీడిని మ‌ల్టీప్లెక్సుల్లో పెట్టి అమ్మితే  రూ.200-300 వ‌సూలు చేస్తారు.. నాకెందుకు రా బాబూ!! అని అస‌లు ఇటీవ‌లి కాలంలో థియేట‌ర్ల‌లో తిండి ప‌దార్థాలు కూల్ డ్రింక్స్ కొన‌డ‌మే మానేస్తున్నారు జ‌నం. బ‌య‌ట రూ.30 కే దొరికే పాప్ కార్న్ ని థియేట‌ర్ల‌లో ఏకంగా 10-20 రెట్లు పెంచి రూ.350 చెల్లించి ఎందుకు కొనుక్కోవాలి? ఉల్లి పాయ‌లతో త‌యారైన మూడు స‌మోసాలు కొనాలంటే మ‌ల్టీప్లెక్సులో రూ.150 ఖ‌ర్చు పెట్టాల్సిన దుస్థితి దేనికి? ఫ్యామిలీ అంద‌రికీ ప్యాకేజీ కొనాలంటే ఏకంగా థియ‌ట‌ర్ కోక్- తినుబండారాల‌కు రూ.5వేలు జేబుకు చిల్లు ప‌డిపోతోంది. అదే డ‌బ్బుతో బ‌య‌ట రెస్టారెంట్ లో రుచిక‌ర‌మైన అద్భుత‌మైన ఫ్యామిలీ ప్యాక్ ధ‌మ్ బిరియానీలు చికెన్ తందూరీలు నాలుగు రోజులు తినొచ్చు. థియేట‌ర్ల‌లో తినుబండారాల ధ‌ర‌లు మ‌రీ అంత ఘోరంగా ఉన్నాయి.

థియేట‌ర్ల‌కు ఒక ర‌కంగా ఈ తినుబండారాల ధ‌ర‌లు కోక్ ల ధ‌ర‌లు ఎప్పుడూ ప్ర‌జ‌ల జేబుల‌కు అద‌న‌పు భారం. ఇందులో ఎలాంటి సందేహాలు ఎవ‌రికీ లేవు. పాప్ కార్న్- శీతల పానీయాల ధరలు సినిమా ప్రేక్షకులకు క‌రెంట్ షాక్ లా త‌గుల్తున్నాయి. దారుణమైన ధరలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. తినుబండారాల ధరలు 10- 20 రెట్లు పెంచి అమ్మేస్తుండ‌డంతో సినిమా టిక్కెట్ల కంటే తినుబండారాలే పెను భారంగా మారాయ‌ని వాపోయే మ‌ధ్య త‌ర‌గ‌తికి జ‌వాబిచ్చే వాళ్లే క‌రువ‌య్యారు. నిజానికి సినిమాకి వెళితే గాళ్ ఫ్రెండ్ తో పాప్ కార్న్ తింటూ ఒకే  కోక్ లో రెండు స్ట్రాలు వేసుకుని తాగాల‌ని బోయ్ ఫ్రెండ్ ఆశ‌ప‌డ‌తాడు. కానీ పాకెట్ మ‌నీ అంత ఉండ‌దు. పాపం ల‌వ‌ర్స్ కి కూడా ఆ ర‌కంగా సెగ త‌గుల్తోంది. ఏదో ప్రెస్టేజ్ కోసం కొనాలి కానీ నిజానికి డ‌బ్బులు పుష్క‌లంగా ఉండి వాళ్లు కొని తిన‌లేరు తాగ‌లేరు!

సాధారణ మార్కెట్ లో ధ‌ర‌ల‌తో పోలిస్తే ఇన్ని రెట్ల తేడాతో థియేట‌ర్ల‌లో తినుబండారాలు పానీయాలు ఎలా అమ్మ‌నిస్తున్నారు? అన్న‌దే పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్?  దీనికి థియేట‌ర్ యాజ‌మాన్యాల నుంచి అధికారులు ప్ర‌జా పాల‌కుల‌కు ఏమైనా వాటాలు అందుతాయా? అన్న సందేహాలు కూడా ప్ర‌జ‌ల్లో అలానే ఉన్నాయి.

షాపుల్లో రూ.30కి విక్రయించే శీతల పానీయం బాటిల్ లోని లిక్విడ్ ని సినిమా హాళ్లలో రూ.350 వరకు ధ‌ర పెట్టి అమ్ముతున్నారు.  పాప్ కార్న్ ధర కాంబో ప్యాక్ అంటూ రూ.550 - రూ.650- రూ.900 అంటూ జేబుకు పెద్ద చిల్లు పెట్టేస్తున్నారు.

ఇటీవల తన కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు హైద‌రాబాద్ లో ఓ మ‌ల్టీప్లెక్సుకి వెళ్లిన మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి ఎదురైన అనుభ‌వం చూస్తే బాధ క‌లుగుతుంది.  500 ఎంఎల్‌ల కోక్ బాటిల్ కు రూ.350 చెల్లించానని ఇదే దుకాణాల్లో రూ.30 కే దొరుకుతుంద‌ని కానీ కుటుంబంలో ఐదుగురు స‌భ్యుల కోసం రూ.1500 కోక్ కోసం మ‌రో రూ.2000 పాప్ కార్న్ కోసం చెల్లించాల్సి వ‌చ్చింద‌ని వాపోయాడు. ఇక ఈ కౌంట‌ర్ల‌లో అమ్మే వాడికి ధ‌ర‌తో సంబంధం లేదు. అమ్మ‌డం వ‌ర‌కే త‌న బాధ్య‌త‌. ఈ ధ‌ర‌ల్ని నిర్ణ‌యించేది మాత్రం పైనున్న గాడ్ లేదా మాఫియా డాన్! ఒక్క హైద‌రాబాద్ లోనే కాదు అన్ని మెట్రో న‌గ‌రాల్లోను ఇదే దుస్థితి. అంతెందుకు విశాఖ‌ప‌ట్నం- తిరుప‌తి లాంటి టూటైర్ న‌గ‌రాల్లో కూడా ఇంత‌కుమించిన ధ‌ర‌ల‌తో థియేట‌ర్ల‌లో తినుబండారాలు కోక్ లు విక్ర‌యిస్తున్నారు.

సినిమా టిక్కెట్ల కంటే శీతల పానీయాలు- పాప్ కార్న్ ధరలు ఎక్కువగా ఉంటే ప్రజలు సినిమా హాళ్లలో అంత పెద్ద మొత్తాలు చెల్లించి కొనుక్కోగ‌ల‌రా?  నెల‌కు ల‌క్ష‌ల్లో జీతాలు అందుకునే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ల‌తో పోటీప‌డుతూ సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌లో క‌నీసం మంచి నీళ్ల బాటిల్ అయినా కొనుక్కోగ‌ల‌రా? అన్న‌ది సందేహం. కానీ సింగిల్ థియేట‌ర్లు లేక‌ సినిమాల కోసం మ‌ల్టీప్లెక్సుల‌కే రావాల్సిన దుస్థితి కూడా ఉందిప్పుడు.

నిజానికి తినుబండారాల ధరలు 'హెడ్ ఆఫీస్'లో బాస్ నిర్ణ‌యిస్తారు. ఆ ధరలు కౌంటర్ లోని బోర్డులపై ప్రదర్శిస్తారు. చ‌చ్చిన‌ట్టు బేరం లేకుండా ప్రేక్ష‌కులు కొనుక్కుని తినాలి. ఎదురు ప్ర‌శ్నించే టైమ్ కూడా అక్క‌డ ఉండదు. ఇది ఇంకో కోణం.

కోవిడ్ మహమ్మారి త‌ర్వాత ఇప్పుడిప్పుడే థియేట్రిక‌ల్ రంగం కుదుట ప‌డుతోంది. సింగిల్ సినిమా హాళ్లు- మల్టీప్లెక్స్ లు చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. కోవిడ్ తో పాటు OTT ప్లాట్ ఫారమ్ ల పోటీని ఎదుర్కొని నిల‌దొక్కుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. కానీ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలంటే ముందు ధ‌ర‌ల మోత త‌గ్గించాలి. ఇప్పుడు అంతా బిజినెస్ లో వంద రెట్ల లాభం వెతుకుతున్నారు. ఒక‌ప్ప‌టిలా సంద‌ర్భానుసారం ధ‌ర‌లు పెంచ‌డం లేదు. మ‌నిషిలో అత్యాశకు హ‌ద్దు అన్న‌ది లేకుండా పోయింది. ఇష్టానుసారం ధ‌ర‌ల్ని పెంచుకుని దోపిడీ చేయ‌డానికి వ్య‌వ‌స్థ అల‌వాటు ప‌డిపోయింది. కార‌ణం ఏదైనా ప‌ర్య‌వ‌సానం మాత్రం తీవ్రంగా ఉంది. థియేట‌ర్ల‌కు వ‌చ్చే జ‌నాల శాతాన్ని ఇది గ‌ణ‌నీయంగా త‌గ్గించేస్తోంది.

థియేట‌ర్ల యాజ‌మాన్యం స్టాఫ్ జీతాలు.. క‌రెంటు బిల్లుల‌ను ఇత‌ర  మెయింటెనెన్స్ వ‌గైరా ఆ తినుబండారాల నుంచే తీయాల్సిన దుస్థితి కూడా ఉంటోంద‌ని ఒక సెక్ష‌న్ నుంచి ఆవేద‌న ఉంది. ఇది వేరొక కోణం... కానీ వీట‌న్నిటికీ గంప గుత్త‌గా ప‌రిష్కారం వెత‌కాల్సి ఉంటుంది. లేదంటే  ప్ర‌స్తుత ఓటీటీ డిజిట‌ల్ యుగంలో థియేట‌ర్లు పూర్తిగా ఎత్తేయాల్సిన స‌న్నివేశం కూడా మునుముందు దాపురించవ‌చ్చు. అత్యాశ‌కు పోకుండా ధ‌ర‌ల్ని నియంత్రించి బ్యాలెన్స్ డ్ గా ముందుకు వెళితేనే మ‌నుగ‌డ‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News