ట్రెండీ టాక్‌: నార‌ప్ప లానే మ్యాస్ట్రో వెన‌క‌డుగు?

Update: 2021-07-11 05:47 GMT
కరోనా మ‌హ‌మ్మారీ అంతా మార్చేసింది. ముఖ్యంగా సినీరంగానికి మ‌నుగ‌డ లేకుండా చేస్తోంది. సెకండ్ వేవ్ ప్ర‌భావం నెమ్మ‌దించ‌డంతో ఇక‌పై నెమ్మ‌దిగా ప‌రిశ్ర‌మ కార్య‌క‌లాపాలు పునః ప్రారంభం కావ‌డంతో కొంత ఉత్సాహం నెల‌కొంది. ఇప్ప‌టికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ను తెరిచేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కొన్ని డిమాండ్ల‌ను నెర‌వేర్చుకుని థియేట‌ర్ల‌ను తెర‌వాల‌ని ఎగ్జిబిట‌ర్లు ఆలోచిస్తున్నారు.

ఇక థియేట‌ర్ల‌కు కంటెంట్ ప‌రమైన స‌మ‌స్య లేకుండా ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ ఇంత‌కుముందు అభ్య‌ర్థించింది. త‌మ‌ని కాద‌ని ఓటీటీల‌కు వెళితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని కూడా ప‌రోక్షంగా హెచ్చ‌రించింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలను OTT విడుదలలను ఎంచుకోవద్దని అక్టోబర్ వరకు వేచి ఉండమని కోరింది. ఆ క్ర‌మంలోనే అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు త‌మ సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా ఆపారు. నార‌ప్ప విష‌యంలో ఓటీటీల‌తో వెంక‌టేష్ సంప్ర‌దింపులు జ‌రిపార‌ని ప్ర‌చార‌మైంది. ఎట్ట‌కేల‌కు నార‌ప్ప ఓటీటీ డీల్ ని ర‌ద్దు చేసుకుని థియేట‌ర్ల‌లో రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇక నారప్ప బాట‌లోనే త‌దుప‌రి నితిన్ న‌టించిన మ్యాస్ట్రోని కూడా థియేట్రిక‌ల్ రిలీజ్ చేసేందుకు ఓటీటీ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోబోతున్నార‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ్యాస్ట్రోని ఇంత‌కుముందు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కి 29కోట్ల‌కు క‌ట్ట‌బెట్టార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు ఆ డీల్ ని క్యాన్సిల్ చేసుకునేందుకు నితిన్ బృందం సిద్ధ‌మ‌వుతోందిట‌. అందుకే నితిన్ టీమ్ ఓటీటీ విడుదల వివరాలను వెల్ల‌డించ‌డం లేదు. థియేటర్లు తెర‌వ‌గానే వెంట‌నే త‌మ సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
మాస్ట్రోకు మెర్లపాకా గాంధీ దర్శకత్వం వహించారు. నితిన్ - తమన్నా- నభా నటేష్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం హిందీ హిట్ అంధాధున్ కి రీమేక్ గా తెర‌కెక్కింది.

నారప్ప‌- మ్యాస్ట్రో బాట‌లోనే త‌దుప‌రి ట‌క్ జ‌గ‌దీష్ - విరాట‌ప‌ర్వం - దృశ్యం 2 వంటి చిత్రాలు థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌కు వేచి చూస్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ క్రైసిస్ లేక‌పోతే ఇవ‌న్నీ వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ఆస్కారం ఉంద‌ని భావిస్తున్నారు. ఆగ‌స్టు- సెప్టెంబ‌ర్ నాటికి పూర్తిగా క్రైసిస్ తొల‌గిపోతే అక్టోబ‌ర్ లో వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల జాత‌ర ఉండ‌నుంది. కేజీఎఫ్ 2- పుష్ప 1- ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు వివిధ రాష్ట్రాల్లో బ‌హుభాష‌ల్లో రిలీజ‌వ్వాలంటే మ‌హ‌మ్మారీ నుంచి ఎలాంటి ముప్పు లేద‌ని క‌న్ఫ‌ర్మేష‌న్ కావాలి.  అలాగే తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య కూడా ప‌రిష్కృతం కావాల్సి ఉంది.

ఏపీలో టిక్కెట్టు రేటు డైల‌మా!

ఇక ఏపీలో టిక్కెట్టు రేట్ల పెంపు ఉంటుందా ఉండ‌దా? అన్న‌ది కూడా చాలా సినిమాల రిలీజ్ లు నిర్ధేశించేందుకు ఆస్కారం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. ఏపీ ప్ర‌భుత్వం పాత జీవోని ర‌ద్దు చేసి కొత్త జీవోని తెచ్చింది. ఇందులో టిక్కెట్టు ధ‌ర‌లు బాగా త‌గ్గించ‌డంతో త‌మ‌కు కిట్టుబాటు కాద‌ని ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్ల‌ను బంద్ చేశారు. ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. ఓవైపు సినీపెద్ద‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దిస్తున్నా స‌రైన స్పంద‌న లేద‌ని కూడా ప్ర‌చార‌మ‌వుతోంది. ఇక‌పై పెద్ద సినిమాల‌కు ఇష్టానుసారం టిక్కెట్టు ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఉంటుందా? అన్న‌ది సందిగ్ధంగా మారింది. ఇది తెలంగాణ‌లో రిలీజ్ ల‌కు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది.
Tags:    

Similar News