త్రివిక్రమ్, సునీల్.. ఇంకా రెంటు కడుతున్నారట

Update: 2016-02-18 11:30 GMT
కొన్ని స్నేహాలు చూసేవాళ్లకు కూడా ముచ్చట గొలుపుతాయి. అలాంటి స్నేహమే త్రివిక్రమ్ శ్రీనివాస్ - సునీల్ లది కూడా. ఇద్దరూ కలిసి భీమవరం నుంచి వచ్చి ఒకేసారి హైదరాబాద్ లో దిగారు. ఒకే గదిలో ఉంటూ సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నో కష్టాల్ని దాటుకుని కాస్త అటు ఇటుగా ఇద్దరూ సినిమాల్లో నిలదొక్కుకున్నారు. ఐతే ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగినా.. ఎంత డబ్బులు సంపాదించినా.. అప్పట్లో త్రివిక్రమ్ తో కలిసి ఒకే గదిలో ఉన్న రోజులే వేరంటున్నాడు సునీల్. పంజాగుట్టలోని ఆ గదిలో తామిద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లమని..  ఆ రోజుల్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు సునీల్.

ఈ సందర్భంగా సునీల్ ఓ ఆసక్తికర విశేషం వెల్లడించాడు. ఒకప్పుడు తామిద్దరం కలిసి ఉన్న గది ఇప్పటికీ అద్దె కడుతున్నట్లు వెల్లడించాడు. పంజాగుట్ట సాయిబాబా గుడి సమీపంలో ఆ గది ఉంటుందని.. అప్పుడప్పుడూ తామిద్దరం అక్కడికి వెళ్తుంటామని.. నెలా నెలా ఆ యజమానికి ఇప్పటికీ అద్దె కడుతున్నామని చెప్పాడు సునీల్. ఆ గదిని ఓ సెంటిమెంటుగా, మధుర జ్నాపకంగా భావించి ఇలా చేస్తున్నట్లు సునీల్ తెలిపాడు. త్రివిక్రమ్ తన కోసం ‘బంతి’ అనే స్క్రిప్టు ఒకటి రాశాడని.. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని సునీల్ వెల్లడించాడు. ప్రస్తుతం తామిద్దరం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నామని చెప్పాడు.

Tags:    

Similar News