సినిమా భాష మార్చమంటున్న త్రివిక్రమ్

Update: 2018-05-28 14:30 GMT
త్రివిక్రమ్ పేరెత్తగానే అతడి మాటల చాతుర్యమే గుర్తుకొస్తుంది. సినిమా భాష ప్రమాణాలు పడిపోతున్న సమయంలో త్రివిక్రమ్ తనదైన ప్రయోగాలతో.. మాటల మ్యాజిక్ తో మళ్లీ దానికి ప్రాణం పోశాడు. ఈ తరం యువతకు కూడా సినిమా డైలాగులపై విపరీతమైన ఆసక్తి రేకెత్తించాడు. మరిచిపోతున్న.. మరుగున పడిపోతున్న మాటలెన్నింటినో తన డైలాగుల్లో కూర్చి వాటిని పాపులర్ చేశాడు. తన సినిమాల ద్వారా భాషను బతికించడానికి ఓవైపు ప్రయత్నం చేస్తూనే.. బయట ఏదైనా ఇంటర్వ్యూలు.. ఇంకేవైనా కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు కూడా భాష గురించి మాట్లాడుతుంటాడు త్రివిక్రమ్. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మారిపోతున్న సినిమా భాష.. బయట జనాల్లో భాష పట్ల శ్రద్ధ తగ్గిపోతున్న వైనంపై ఆవేదనగా మాట్లాడాడు. మన సినిమా భాష మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

టీవీలు వచ్చాక మన భాష చాలా మారిపోయిందని.. ప్రతిదీ అప్పటికప్పుడు వెతుక్కుని మాట్లాడుతున్నారని త్రివిక్రమ్ అన్నాడు . ‘రావడం జరిగింది.. చెప్పడం జరిగింది.. వెళ్లడం జరిగింది’ ఇలా భాష విచిత్రంగా తయారైందని.. ఇలాంటి భాష ఏ పత్రికలోనూ ఉండదని.. ఏ పుస్తకాల్లో కూడా లేదని త్రివిక్రమ్ అన్నాడు. ఇప్పుడు సినిమాల్లోనూ ఇలాంటి మాటలు వాడేస్తున్నారని.. రాసేస్తున్నారని.. అదే తెలుగు అయిపోతోందని త్రివిక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాతి తరం ఇదే భాష అనుకునే ప్రమాదం ఉందని.. కాబట్టి మన భాష ఇలా సంకరం అయిపోకూడదని.. సినిమా భాష కూడా మార్చాలని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డాడు. మన భాష అంటే మనకు చులకన అని.. చేతిలో ఇంగ్లిష్ పేపర్ పెట్టుకుంటే దాన్నొక స్టైల్ అనుకుంటున్నారని.. మన భాషకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలని.. సాహిత్యాన్ని పట్టించుకోవాలని త్రివిక్రమ్ అన్నాడు. బుక్ క్లబ్స్.. రీడింగ్ క్లబ్స్ కల్చర్ మన దగ్గర రావాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
Tags:    

Similar News