త్రివిక్రమ్ పేరు వాడుకున్నందుకు అంత తక్కువా..?

Update: 2022-07-28 02:30 GMT
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాని సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు వచ్చే నెల ద్వితీయార్థంలో SSMB28 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఓ కమర్షియల్ యాడ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రస్తుతం ఓ యాడ్ ను షూట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ప్రముఖ కంపెనీ కోసం చేస్తున్న ఈ వాణిజ్య ప్రకటన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సెట్ లో దర్శక హీరోలకు సంబంధించిన కొన్ని ఫోటోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ కమర్షియల్ యాడ్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఓ రూమర్ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే కొన్ని సెకండ్ల పాటు ఉండే ఈ ప్రకటన కోసం దర్శకుడు రూ. 45 లక్షల వరకూ ఛార్జ్ చేశాడని అంటున్నారు.

అంతేకాదు త్రివిక్రమ్ ఈ యాడ్ కోసం చేసిందేమీ లేదని.. కేవలం 'యాక్షన్' - 'కట్' మాత్రమే చెప్పాడని.. మిగతాదంతా క్రియేటివ్ టీమ్ చూసుకుందని టాక్ నడుస్తోంది. రెండు మాటలు చెప్పడానికే దర్శకుడికి అంత మొత్తం చెల్లించారని చెబుతున్నారు.

నిజానికి పాపులర్ స్టార్స్ మరియు స్టార్ డైరెక్టర్లను తమ వాణిజ్య ప్రకటనలో భాగం చేయాలని ప్రతీ కంపెనీ భావిస్తుంటుంది. సినీ పరిశ్రమలో ప్రముఖులు తమ కమర్షియల్స్ కోసం పనిచేస్తున్నారని చూపించి.. తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలని చూస్తుంటారు.

అందుకే బ్రాండ్ వాల్యూని బట్టి ఎంత ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ప్రతీ స్టార్ హీరో కూడా ఇప్పుడు త్రివిక్రమ్ తో వర్క్ చేయడానికి ఆరాట పడుతున్నారు.. ఆయన అడిగితే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంతేకాదు త్రివిక్రమ్ ఇప్పటికే పలు ప్రముఖ కమర్షియల్ యాడ్స్ కు దర్శకత్వం కూడా వహించారు.

ఇవన్నీ చూసుకుంటే.. డైరెక్టర్ కి ఉన్న డిమాండ్ ని బట్టి ఆయన యాక్షన్ - కట్ అని రెండు మాటలు చెప్పినందుకు.. త్రివిక్రమ్ పేరు వాడుకుంటున్నందుకు రూ. 45 లక్షలు అనేవి చాలా తక్కువ అమౌంట్ అనే చెప్పాలి.

ఇకపోతే మహేశ్ బాబు తో త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్ట్ షూటింగ్ ఆగస్టు 16వ తేదీన మొదలవుతుందని సమాచారం. 'అతడు' 'ఖలేజా' తర్వాత వీరి కాంబోలో రానున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Tags:    

Similar News