తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మరో ఉద్యమం!

Update: 2016-07-25 04:17 GMT
ఈ మద్యకాలంలో డబ్బింగ్ ఆర్టిస్టులు - డబ్బింగ్ సీరియల్స్ పై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఆ చర్చ ప్రేక్షకుల వరకూ వెళ్లిందా లేదా అనే విషయం కాసేపు పక్కనపెడితే... దీనిపై తెలుగు సినిమా ఆర్టిస్టులు - సీరియళ్ల నటులు - టెక్నీషియన్లు మాత్రం నిత్యం పోరాడుతూనే ఉన్నారని చెప్పాలి. తెలుగు టీవీ సీరియల్స్ లో ఈ మధ్యకాలంలో రోజు రోజుకీ డబ్బింగ్ సీరియల్స్ ప్రభావం పెరిగిపోతుందనేది జగమెరిగిన సత్యం. దీంతో తెలుగు సీరియల్ నటులు పనులు కోల్పోతున్నారనేది కూడా వాస్తవమే. ఈ క్రమంలో మరోసారి ఉద్యమానికి సిద్దమయ్యారు తెలుగు ఆర్టిస్టులు.

డబ్బింగ్‌ సీరియళ్లతో తెలుగు నటులు - సాంకేతిక నిపుణుల జీవితాలు రోడ్డున పడుతున్నాయని ‘తెలుగు టెలివిజన్‌ యూనియన్‌’ ఉద్యమానికి సిద్ధమైంది. ఫిలిం చాంబర్‌లో సమావేశమైన ‘తెలుగు టెలివిజన్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌’ ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బింగ్ సీరియల్స్ ని ఆపేయాల్సిందే అని, అలాకాని పక్షంలో మరోసారి ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీచేశారు. ఈ విషయాలపై త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.

దీంతో మరోసారి తెలుగు సీరియల్ నటులు - టెక్నీషియన్ల ఉద్యమం మొదలుకాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై సదరు టీవీ యాజమాన్యాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, తెలుగు నటుల డిమాండ్ కూడా సహేతుకంగానే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్యమం పాలపొంగులా లేచి పడుతుందా, లేక సాదించేవరకూ కొనసాగుతుందా అనేది వేచిచూడాలి!
Tags:    

Similar News