'ఎఫ్ 3' కి క్లీన్ 'U'.. సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే..?

Update: 2022-05-20 06:45 GMT
విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ''ఎఫ్ 3''. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే తాజాగా 'ఎఫ్ 3' సినిమాకు సంబంధించి సెన్సార్‌ తో సహా అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని మేకర్స్ ప్రకటించారు. 2 గంటల 28 నిమిషాల నిడివితో ఈ చిత్రానికి క్లీన్ యూ (U) సర్టిఫికేట్ వచ్చిందని తెలిపారు. ఈ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. చాలా కాలం తర్వాత క్లీన్ అండ్ హెల్తీ ఎంటర్‌టైనర్‌ ని వీక్షించినట్లు చెప్పారని తెలుస్తోంది.

సూపర్ హిట్ 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో తెరకెక్కిన ''ఎఫ్ 3'' సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇటీవల రిలీజ్ చేయబడిన థియేట్రికల్ ట్రైలర్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమాలోని పాటలు కూడా తగినంత గ్లామర్ డోస్‌ ని ఇచ్చాయి.

కామెడీ అనేది ఏదో ఒక వర్గానికి లేదా నిర్దిష్ట వయస్సు వారికి పరిమితం కాదు కనుక.. 'F3' సినిమా ప్రేక్షకులందరినీ ఆకర్షించే అవకాశం ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి భారీ తారాగణంతో కామెడీని డీల్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రతి యాక్టర్ కూ స్కోర్ ఉండేలా సినిమా అంతా అన్ లిమిటెడ్ ఫన్ ఉంటుందని చెబుతున్నారు.

వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కామిక్ టైమింగ్ మరియు వారి మేనరిజమ్స్ వినోదాన్ని అందించనున్నాయి. ఇందులో వెంకీకి నైట్ బ్లైండ్‌ నెస్ సమస్య ఉండగా.. వరుణ్ నత్తితో బాధపడుతుంటాడు. హీరోయిన్లు తమన్నా భాటియా - మెహ్రీన్ పాత్రలు కూడా హాస్యభరితంగా రూపొందించబడగా.. సునీల్ మరియు సోనాల్ చౌహాన్ రోల్స్ స్పెషల్ గా నిలవనున్నాయి.

'ఎఫ్ 3' సెకండాఫ్‌లో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వస్తాయని.. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఇన్సైడ్ టాక్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అందులో పార్టీ సాంగ్ లో పూజా హెగ్డే ఆడి పాడనుంది.

'ఎఫ్ 3' చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించగా.. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. సాయి శ్రీరామ్ దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'F2' కంటే రెట్టింపు వినోదాన్ని అందించబోతోందని చిత్ర బృందం చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News