మూవీ రివ్యూ : ఉగ్రం

Update: 2023-05-05 17:17 GMT
'ఉగ్రం' మూవీ రివ్యూ
నటీనటులు: అల్లరి నరేష్-మిర్నా-శరత్ లోహితశ్వ-శత్రు-ఇంద్రజ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సిద్దార్థ్
కథ: తూమ్ వెంకట్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: సాహు గారపాటి-హరీష్ పెద్ది
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కనకమేడల

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అల్లరి నరేష్ 'నాంది'తో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఆ సీరియస్ సినిమా మంచి ఫలితాన్ని అందుకోగా.. దాన్ని రూపొందించిన విజయ్ కనకమేడలతో నరేష్ చేసిన మరో చిత్రం.. 'ఉగ్రం' మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నరేష్-విజయ్ జోడీ ఈసారి ఏమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.


కథ:

శివ (అల్లరి నరేష్) ఒక నిజాయితీ కలిగిన పోలీస్. హైదరాబాద్ సిటీలో సీఐగా పని చేసే అతడికి తన భార్యా పిల్లల మీద అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ.. వాళ్లకంటే కూడా తన డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఐతే కుటుంబానికి సమయం కేటాయించకుండా డ్యూటీ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన శివతో విసిగిపోయిన భార్య అపర్ణ (మిర్నా).. కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఆమె పట్టుదల చూసి భార్యాబిడ్డల్ని పుట్టింట్లో దించడానికి కార్లో వరంగల్ బయల్దేరతాడు శివ. కానీ మధ్యలో ప్రమాదం జరిగి శివ మతిస్థిమితం కోల్పోతాడు. అప్పుడే తన భార్యాబిడ్డలు కనిపించకుండా పోతారు. ప్రమాదం వల్ల మెదడుకు దెబ్బ తగిలి తన భార్య.. కూతురిని ఆసుపత్రిలో చేర్చినట్లు ఊహించుకుంటూ ఉంటాడు శివ. ఇలాంటి స్థితిలో ఉన్న అతను.. తన భార్య-బిడ్డని ఎలా కాపాడుకున్నాడు.. వాళ్లిద్దరూ అదృశ్యం కావడం వెనుక కారణాలేంటి అన్నది తెర మీదే చూడాలి.


కథనం-విశ్లేషణ:

'ఉగ్రం' టీజర్.. ట్రైలర్లలో అందరి దృష్టినీ ఆకర్షించింది.. కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ ఉగ్రరూపంలోకి మారి చేసిన విధ్వంసమే. తనకు ఒకప్పుడు ఉన్న ఇమేజ్ ఏంటి.. అతను ఇంత వయొలెంట్ గా మారడం ఏంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నరేష్ లోని ఈ వయొలెంట్ యాంగిలే సినిమాకు కూడా హైలైట్ అవుతుందేమో అనిపించింది. కానీ ఇందులో చూపించిన కథకు.. నరేష్ అంత వయొలెంట్ గా కనిపించడానికి అసలు పొంతనే కుదరలేదు. ఇంకా చెప్పాలంటే కథ కోణంలో చూస్తే నరేష్ క్యారెక్టరైజేషనే కొంచెం మైనస్ అయింది. దర్శకుడు విజయ్ కనకమేడల తొలి చిత్రం 'నాంది'లో మాదిరే రొటీన్ కు భిన్నమైన కథనే ఎంచుకున్నాడు ఇందులో. ప్రేక్షకులను గెస్సింగ్ లో ఉంచేలా ఆసక్తికర మలుపులతో ఆ కథను చక్కగా.. చిక్కగానే తీర్చిదిద్దుకున్నాడు. కానీ ఆ కథలో అయిన దానికి కాని దానికి ఉగ్రరూపం దాలుస్తూ.. కమర్షియల్ కోణంలో సాగే నరేష్ పాత్రను ఇరికించడమే కొంచెం కష్టం అయింది. నరేష్ పాత్రను మామూలుగానే చూపించి.. తాను ఎంచుకున్న కథనే స్ట్రెయిట్ టు ద పాయింట్ చెప్పి ఉంటే 'ఉగ్రం' ఇంకా మంచి సినిమా అయ్యేది. ఐతే 'నాంది' స్థాయిలో కాకపోయినా 'ఉగ్రం' కూడా విషయం ఉన్న సినిమానే.

కథ పరంగా చూస్తే కొన్ని నెలల కిందటే వచ్చిన 'యశోద'ను తలపిస్తుంది 'ఉగ్రం' సినిమా. అందులో సరోగసీ పేరుతో పెద్ద మెడికల్ స్కామ్ చేసే ముఠా చుట్టూ కథ తిరిగితే.. ఇందులో ఒంటరిగా దొరికే మనుషులను కిడ్నాప్ చేసి వారితో ఇంకో రకమైన స్కామ్ చేసే ముఠా చుట్టూ కథను నడిపించారు. ఈ కిడ్నాప్ చేసే వైనం.. అందుకు ఎంచుకునే మార్గం.. దీన్ని హీరో ఛేదించే విధానం.. ఇవన్నీ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ కిడ్నాప్ అయిన మనుషులతో ఆ ముఠా పొందే ప్రయోజనం అంత నమ్మశక్యంగా అనిపించకపోయినా.. కథ పరంగా చివరి వరకు ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచుతుంది. కాకపోతే మంచి థ్రిల్లర్ అవడానికి అవకాశం ఉన్న 'ఉగ్రం'లో అవసరం లేని హీరో ఎలివేషన్లు.. కమర్షియల్ హంగులను జొప్పించడానికి ప్రయత్నించడంతోనే వచ్చింది సమస్య. భార్యాబిడ్డలు ఏమయ్యారనే టెన్షన్లో ఉన్న హీరో.. వాళ్లను కనుక్కోవడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతున్న సమయంలో ప్రేక్షకులు ఉత్కంఠగా ఏం జరుగుతుందా అని చూస్తున్న సమయంలో ఆ మూడ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ ఒక జాలీ సాంగ్ పెట్టడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు.

ఇక నరేష్ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా ఏమంత ఆకట్టుకోదు. అతను ప్రతిసారీ ఎందుకు అంత కోపంతో ఊగిపోతాడు.. ఏమాత్రం ఆలోచన లేని విధంగా ప్రవర్తిస్తాడు అన్నది అర్థం కాదు. అందులో ఒక లాజిక్ కనిపించదు. తప్పు చేసిన వాళ్ల మీద కోపం రావచ్చు.. వాళ్లను శిక్షించవచ్చు.. కానీ అది కొంచెం హద్దుల్లో కూడా ఉండి చేయొచ్చు కదా.. అలా పిచ్చి పట్టినవాడిలా ఊగిపోవడం ఏంటో అర్థం కాదు. కమర్షియల్ సినిమాల్లో కామెడీగా హీరో విలన్లను చంపి అవతల పడేస్తే అర్థం చేసుకోగలం కానీ.. కథను అనుసరించి రియలిస్టిగ్గా సాగే సినిమాలో.. భార్యను అబ్యూజ్ చేశారని ఊగిపోతూ గన్ను పట్టుకెళ్లి నలుగురిని టపాటపా కాల్చేసి వచ్చేయడమేంటో అర్థం కాదు. సినిమా అంతటా కూాడా నరేష్ పాత్ర అసహజంగా.. అవసరం లేని ఆవేశంతోనే కనిపిస్తుంది. లుక్ పరంగా మేకోవర్ చేసుకుని.. నరేష్ ఎంత బాగా చేయాలని ప్రయత్నించినా కూడా అతణ్ని మరీ అంత వయొలెంట్ గా చూడటం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ పాత్ర సంగతి పక్కన పెడితే..  కథాకథనాల్లో మాత్రం 'ఉగ్రం' ఓకే అనిపిస్తుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేతో అసలేం జరిగింది అనే సస్పెన్సుని చాలా వరకు బాగానే నడిపించారు. హీరో ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు మామూలుగానే అనిపించినా.. ఈవ్ టీజింగ్ ట్రాక్.. హిజ్రాల ట్రాక్ వంటి వాటితో ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగాడు దర్శకుడు విజయ్. కిడ్నాప్ కుట్రను హీరో ఛేదించే విధానం చాలా వరకు ఆసక్తికరంగానే సాగింది. దాంతో కనెక్ట్ అయి సాగుతున్నంతసేపు ఒక భిన్నమైన సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కంటెంట్ ఉన్న సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది చివరికి. 'ఉగ్రం' చూసినందుకు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరమైతే ఉండదు.


నటీనటులు:

'నాంది' తర్వాత ఈ సినిమాలో మరింతగా ఆశ్చర్యపరిచాడు నరేష్. ఇక తన పేరులోంచి 'అల్లరి' తీసేయొచ్చు అనేంత సీరియస్ గా.. వయొలెంట్ గా కనిపించాడు ఇందులో. తన మేకోవర్ బాగుంది. పెర్ఫామెన్స్ కూడా వంక పెట్టలేని విధంగా ఉంది. కాకపోతే ఆ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన విధానమే కొంచెం అభ్యంతరకంగా అనిపిస్తుంది. పాత్ర కనిపించేంత వయొలెంట్ గా నరేష్ వాయిస్ లేకపోవడం కూడా మైనస్సే. కొంచెం డిఫరెంట్ మాడ్యులేషన్ ట్రై చేయాల్సింది. హీరోయిన్ మిర్నా పర్వాలేదు. తనకు కథలో ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. లుక్స్ పరంగా కొంచెం వీక్ అనిపించినా.. తన నటన ఆకట్టుకుంటుంది. సహాయ పాత్రలో శత్రు మెరిశాడు. విలన్ పాత్ర చేసిన నటుడు ఓకే. ఇంద్రజ.. శరత్ లోహితశ్వ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం:

థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీ చరణ్ పాకాల 'ఉగ్రం'ను నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయడానికి గట్టిగానే ప్రయత్నించాడు. ఆర్ఆర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పాటలు మాత్రం స్పీడ్ బ్రేకర్లలా అనిపిస్తాయి. సిద్దార్థ్ ఛాయాగ్రహణం ఈ కథకు తగ్గట్లుగా సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సరిపడా స్థాయిలో ఉన్నాయి. నరేష్ గత చిత్రాలతో పోలిస్తే క్వాలిటీ కనిపిస్తుంది. తూమ్ వెంకట్ అందించిన కథే 'ఉగ్రం'కు అతి పెద్ద బలం. మూల కథ చుట్టూ దర్శకుడు విజయ్ కనకమేడల అల్లుకున్న స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కానీ ఈ కథను రెండున్నర గంటల సినిమాగా మార్చడానికి అవసరమైనంత సరంజామాను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోలేదు. దీన్నో పకడ్బందీ థ్రిల్లర్ లాగే తీర్చిదిద్దాల్సింది. కానీ అవసరం లేని హీరో ఎలివేషన్లు.. కమర్షియల్ హంగులు అద్దడానికి చేసిన ప్రయత్నంలో అక్కడక్కడా సినిమా ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. దర్శకుడిగా విజయ్ కి ఓ మోస్తరు మార్కులు పడతాయి.

చివరగా: ఉగ్రం.. మంచి కథలో కమర్షియల్ కంగాళీ

రేటింగ్- 2.75/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Similar News