ఎంపీగా ఉపాసన పోటీ.. నమ్మొచ్చా?

Update: 2018-04-24 08:55 GMT
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటింది. ఆయనకు ఈ మధ్యే చురుకుపుట్టింది. పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారి.. ఏవో కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి అంశం మీదా స్పందిస్తున్నాడు. ఇన్నాళ్లూ పవన్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న మెగా ఫ్యామిలీ శ్రీరెడ్డి ఇష్యూతో బయటికి వచ్చింది. పవన్‌ తో చేతులు కలిపింది. ఇటీవల రామ్ చరణ్ కూడా పవన్‌ కు బాగా క్లోజ్ అయ్యాడు. చరణ్ కొత్త సినిమా ‘రంగస్థలం’ను థియేటరు కెళ్లి చూడటమే కాక.. ఆ చిత్ర సక్సెస్ మీట్లోనూ పాల్గొన్నాడు పవన్. ఈ నేపథ్యంలో మీడియాకు కొత్త సందేహాలు పుట్టుకొచ్చేశాయి. ఈ క్రమంలో కొత్త రూమర్లు కూడా బయటికి వచ్చాయి.

రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుందట.. ఆమెకు సరిపోయే నియోజకవర్గం కోసం పరిశీలన జరుపుతున్నారట. ఈ మేరకు మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ వ్యాపార కార్యకలాపాలతో ఉపాసన ఎంత బిజీగా ఉందో తెలిసిందే. ఉపాసన కుటుంబానికి చాలా పెద్ద బ్యాగ్రౌండ్. కానీ ప్రతాప రెడ్డి కుటుంబీకులు ఎవ్వరూ కూడా రాజకీయాల వైపు అడుగులు వేయలేదు. ఆయన కానీ.. వేరే కుటుంబ సభ్యులు కానీ కోరుకుంటే రాజ్యసభకు కూడా వెళ్లి ఉండేవారేమో. కానీ కేవలం వ్యాపార కార్యకలాపాల మీదే దృష్టిపెట్టి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరి చిరు ఇంటికి కోడలుగా వచ్చిన ఉపాసన.. చరణ్ బాబాయి పెట్టిన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటుందా? మరీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందన్న అంచనాలు కూడా ఏమీ లేవాయె. ఉపాసన రాజకీయాలు నడిపితే హైదరాబాద్ కేంద్రంగానే చేయాలి. ఇక్కడ జనసేనకు పెద్దగా ఊపేమీ లేదు. మరి ఆంధ్రా ప్రాంతంలో జనసేన తరఫున పోటీ చేస్తే ప్రత్యర్థుల దాడి ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. గెలిచే అవకాశాలున్న ప్రాంతాల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఉపాసనను నిలిపే సాహసం చేస్తారా? అయినా ఉపాసన తీరు చూస్తే ఆమెకు రాజకీయాలపై ఎంతమాత్రం ఆసక్తి ఉన్నట్లు కనిపించదు. మరోవైపు తాను చిరు-చరణ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉపాసనను అందులోకి దించడానికి అంగీకరిస్తారా అన్నది కూడా చూడాలి. ఈ సమీకరణాలన్నీ ఆలోచిస్తే ఉపాసన ఎంపీగా పోటీ చేస్తుందనేది జస్ట్ రూమర్ అనే అనుకోవాలి.
Tags:    

Similar News