ఫార్ములా స్టోరీల్ని ఇక టాలీవుడ్ వ‌దిలేయాలేమో!

Update: 2022-05-08 02:30 GMT
టాలీవుడ్ కి ఇప్పుడు వింతైన ప‌రిస్థితి ఎదురు కానుంది. ఓవైపు బాలీవుడ్ ని సైతం ఢీకొట్టి 1000 కోట్ల క్ల‌బ్ సినిమాల్ని అందిస్తున్నామ‌ని జ‌బ్బ‌లు చరుచుకోవ‌డం బాగానే ఉన్నా కానీ ఇక‌పై వ‌రుస‌గా తెర‌కెక్కించే సినిమాల‌న్నీ అదే రేంజులో ఉండాల‌న్న పోటీత‌త్వం పెరుగుతోంది. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ పాన్ ఇండియా రేస్ లోకి వ‌చ్చారు.

నిజానికి ఈ స‌న్నివేశం ఎంతో ఛాలెంజింగ్ గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా కంటెంట్ ప‌రంగా ఎంతో మార్పుకు ఇది కార‌ణం కానుంది. మునుముందు తెలుగు సినిమా క‌థ‌లు లోక‌ల్ ఫార్ములాతో తెర‌కెక్కే ప‌రిస్థితి ఉండ‌దనేందుకు సంకేతమిది. కేవ‌లం తెలుగు ఆడియెన్ కోసం లేదా తెలుగు రాష్ట్రాలు ఓవ‌ర్సీస్ కోస‌మే సినిమాలు తీస్తామంటే ఇక‌పై కుద‌ర‌దు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలు ఇక‌పై వ‌ర్క‌వుట‌య్యే ఛాన్సుండ‌ద‌న్న ఆందోళ‌న కూడా ఇప్పుడు రైట‌ర్లలో ఉండి ఉంటుంది. భారీ బ‌డ్జెట్లు లేకున్నా కానీ ఎంచుకునే కంటెంట్ విష‌యంలో త‌గ్గే ప‌రిస్థితి ఇక‌పై ఉండ‌దు.

పెద్ద స్టార్లు అయితే ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ పాన్ ఇండియా కంటెంట్ ని రైట‌ర్లు అందించాల‌ని కోరుకుంటారు.  ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందుకున్న హీరోల‌కు ఇది పెను స‌వాల్ గా మారనుంది. ఎంచుకునే స్క్రిప్టు కాన్వాసు ప్ర‌తిదీ ఇప్పుడు త‌ర‌చి త‌ర‌చి చూడాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

ఇక‌పై కేవ‌లం తెలుగు సినిమాని దృష్టిలో పెట్టుకుని తీసే ఆలోచ‌న‌ను కూడా కొంద‌రు ఇప్ప‌టికే విర‌మించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది స‌న్నివేశం. అయితే పాన్ ఇండియా అంటే చాలా రిస్కుల‌తో కూడుకున్న‌ది. బ‌డ్జెట్లు స‌హా రిలీజ్ విష‌యాలు చాలా ఇబ్బందుల్ని తెస్తాయి. అందువ‌ల్ల ప్ర‌తిదీ ప్ర‌ణాళికాబద్ధంగా జక్క‌న్న‌లా స‌క్సెస్ ఫుల్ గా చేయాల్సి ఉంటుంది.

హిందీ మార్కెట్ ని కొల్ల‌గొట్టాల‌న్న ఆత్రంలో ఉన్న మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌తిదీ ప్లానింగ్ తో సాధించుకోవాల్సి ఉంటుంది. ఒక రొటీన్ ఫార్ములా క‌థ‌ల్ని వ‌దిలేస్తేనే ఏదైనా సాధ్య‌ప‌డుతుంది. ఇరుగు పొరుగు మార్కెట్ల‌లో రాణించ‌డం కోసం యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థ‌ల్ని మిశ్ర‌మ‌ కాస్టింగ్ ఎంపిక‌ల్ని స్వాగ‌తించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ఇది జ‌రుగుతోంది. కానీ మునుముందు ఇంకా మారే స‌న్నివేశం ఉంది. ఇటీవ‌ల విడుద‌లైన ఓ పెద్ద సినిమా ట్రైల‌ర్ చూస్తే ప‌ర‌మ రొటీన్ గా తెలుగు సినిమా ఫార్ములాటిక్ గా క‌నిపిస్తోంది. ఇక‌పై రిలీజ‌య్యే ప్ర‌తి సినిమాకి ప్ర‌జ‌లు ఇలా లాజిక్ వెతికితే క‌నుక స‌మ‌స్య ఇంకా పెద్ద‌గా మారుతున్న‌ట్టు భావించాలి.

ఇక ముందు కూడా రొటీన్ ఫార్ములాతో ముందుకు సాగుతామంటే ప్ర‌జ‌లు అంగీక‌రించే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు. ప్ర‌తిసారీ వైవిధ్యం కావాల‌ని అభిమానులే కోరుకుంటున్నారు. అందువ‌ల్ల‌ తాజాగా మారిన స‌న్నివేశాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు - ర‌చ‌యిత‌లు.. హీరోలు భేరీజు వేసుకుని ముందుకు సాగుతార‌ని 'తుపాకి' ఎక్స్ క్లూజివ్ గా కోరుకుంటోంది. ఇటీవ‌లి కాలంలో అగ్ర హీరోలు పోటీప‌డుతూ అద్భుత క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం కొత్త ప‌రిణామం. ఇది ఇక‌పైనా కొన‌సాగాల‌నే ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News