చిరు వ‌ర్సెస్ పూరి.. ఫ్లాపైతే ఏం చేస్తారంటే?

Update: 2022-10-13 04:34 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ క్రిటిక్స్ ప్ర‌శంస‌ల‌తో పాటు ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌క్సెస్ ని చిరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత‌కుముందే ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ చిరును ఆయ‌న స్వ‌గృహంలోనే క‌లిసి అభినందించ‌గా దాదాపు రెండు గంట‌ల పాటు క్రిటిక్స్ తో ముచ్చ‌టిస్తూ త‌న ఆనందాన్ని పంచుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మెగాస్టార్ లైవ్ చాట్ చేశారు. ఈ చాటింగ్ లో బోలెడ‌న్ని టాపిక్స్ చ‌ర్చ‌కు వ‌చ్చాయి. గాడ్‌ఫాదర్ స‌హా తమ ఇటీవలి వైఫల్యాలైన లైగర్ .. ఆచార్య గురించి కూడా ఆ ఇద్ద‌రూ మాట్లాడారు. తాను బొంబాయిలో ఉంటున్నానని ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్ పై పని చేస్తున్నానని పూరి చెప్పారు.

ఫెయిల్యూర్ ని ఎలా తీసుకుంటారు అనే దానిపై పూరి సమాధానమిస్తూ.. మాన‌సిక అల‌జ‌డికి సంబంధించిన‌ పీరియడ్ నెల కంటే ఎక్కువ ఉండదని తాను నమ్ముతానని చెప్పాడు. లైగర్‌ కోసం మూడేళ్లపాటు పని చేయడం తనకు ఆనందాన్ని కలిగించిందని అయితే దాని వైఫల్యం వచ్చే మూడేళ్లపాటు తనను ఏడిపించలేదని పూరీ చెప్పాడు. అంతేకాదు.. బ్లాక్ బస్టర్ స్కోర్ చేసినప్పుడు ఎవరైనా మేధావిగా కనిపిస్తారని అదే వ్యక్తి ఫెయిల్యూ ర్ లో ఫూల్ లాగా కనిపిస్తారని పూరి అన్నారు.

లైగర్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకున్న పూరి జిమ్ కి వెళ్లి 100 స్క్వాట్ లు చేశానని వెల్లడించాడు. ఇదే విషయంపై చిరు స్పందిస్తూ.. తన ఆచార్య వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. మేలో కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లి రెట్టింపు శక్తితో వచ్చానని చెప్పాడు. చిరు చివరి నిమిషం వరకు గాడ్ ఫాదర్ టీమ్ .. తాను సినిమా బాగు కోసం మార్పులు చేర్పులు చేశామని చెప్పారు.  మొత్తానికి పూరి లైగ‌ర్ ఫెయిలైంద‌ని అంగీక‌రించ‌గా చిరు మాత్రం ఆచార్య పేరు ప్ర‌స్థావించ‌కుండానే క్లాసీగా జ‌వాబిచ్చారు.

'ఆటో జానీ' సంగ‌తేంటీ?

మెగాస్టార్ తో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆటోజానీ కొన్ని చ‌ర్చ‌ల అనంత‌రం మ‌ధ్య‌లోనే ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. చిరుతో తాజా చాటింగ్ సెష‌న్ లో 'ఆటో జానీ' ప్ర‌స్థావ‌న తేవ‌డం ఆస‌క్తిక‌రం. కొన్నేళ్ల క్రితం పూరి జగన్నాథ్ ఆటో జానీ అనే స్క్రిప్ట్ తో చిరంజీవిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అది కార్యరూపం దాల్చలేదు. ఈ చాట్ లో చిరు ఆటో జానీ టాపిక్ ని తీసుకొచ్చి దానికి పూరీ ఏం చేశారంటూ ప్రశ్నించారు. దానికి పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. తాను దానిని పక్కన పెట్టానని ఆ 'పాత లుక్' కాన్సెప్ట్ కంటే మెరుగైన స్క్రిప్ట్ పై పని చేస్తానని చెప్పాడు. పూరి డైరెక్షన్ లో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నానని చిరు అన్నారు.

ఒక‌రిని మించి ఒక‌రు...!

లైగర్ ఘోరమైన ప‌రాజ‌యం పాల‌య్యాక ఆ షాక్ నుండి పూరీ జగన్నాథ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆచార్య‌తో ఫ్లాప్ అందుకున్న‌ చిరంజీవి పూరీ జగన్నాథ్ కి మోటివేషనల్ క్లాస్ తీసుకోవడం ఆస‌క్తిక‌రం. ఫెయిల్యూర్ తో తాను దిగజారన‌ని గాడ్ ఫాదర్ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి కొన్ని రీషూట్‌లు చేయడంపై దృష్టి పెట్టినట్లు చిరు తెలిపారు. గాడ్ ఫాదర్ తో మంచి విజయాన్ని సాధించానని కూడా చెప్పాడు. పూరీ జగన్నాథ్ ఈ క్లాస్ ని బహుశా స్ఫూర్తిగా తీసుకున్నాడు. మెగాస్టార్ లాగా మాట్లాడాలంటే పూరీకి హిట్ కావాల్సిందే మ‌రి. ఆటోజానీ కంటే ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్టుతో చిరును ఒప్పించి సినిమా తీసి హిట్టు కొట్ట‌డం ఒక్క‌టే పూరీ ముందున్న మార్గం. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న రెండు సినిమాల తర్వాత పూరీ జగన్నాథ్ తో ప‌ని చేసేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News