'గాడ్ ఫాదర్' క్లోజింగ్ కలెక్షన్స్: బాస్ కు ఈసారి కూడా లాసే..!

Update: 2022-10-29 03:33 GMT
మెగాస్టార్ చిత్రం నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించారు. భారీ అంచనాల నడుమ దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే ఆశ్చర్యకరంగా దానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టలేకపోయింది.

'గాడ్ ఫాదర్' సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 55.80 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీతో కలుపుకొని రూ. 43 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ 52.5 కోట్లు కలెక్ట్ చేస్తే.. హిందీ వెర్షన్ 4.50 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఓవరాల్ గా 'గాడ్ ఫాదర్' బడ్జెట్ మరియు కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిందనే చెప్పాలి. యూఎస్ఏ మార్కెట్‌ లో 6.3 కోట్లకు అమ్మితే.. అక్కడ కేవలం 5.30 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. నైజాం మరియు ఈస్ట్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్స్ సైతం భారీగా నష్టపోయారని తెలుస్తోంది. మిగతా ఏరియాలలో బయ్యర్లు స్వంతంగా రిలీజ్ చేసుకున్నందున నష్టం లేదా బ్రేక్‌ ఈవెన్‌ ను లెక్కించలేము.

మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 37.5 కోట్ల వరకూ రాబట్టగలిగింది. అయితే ఇప్పుడు 'గాడ్ ఫాదర్' సినిమా హిట్ టాక్ తో 43 కోట్ల వద్దే ఆగిపోవడం షాకింగ్ అనే చెప్పాలి. దసరా సీజన్ లో లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకొని భారీ వసూళ్లను రాబడుతుందని అందరూ భావించారు. అయితే ఓపెనింగ్ డే బాగానే ఉన్నా.. ఆ తర్వాతి రోజు నుంచి కోలుకోలేకపోయింది. దీంతో 'ఆచార్య' తర్వాత చిరంజీవికి వరుసగా రెండో పరాజయంగా నిలిచిపోయింది.

'గాడ్ ఫాదర్' సినిమా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. (ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం)
నైజాం - 11.60 కోట్లు
సీడెడ్ - 10 కోట్లు
UA - 6. 10 కోట్లు
గుంటూరు - 3. 85 కోట్లు
ఈస్ట్ - 3. 90 కోట్లు
వెస్ట్ - 2. 50 కోట్లు
కృష్ణా  - 2. 75 కోట్లు
నెల్లూర్ - 2. 30 కోట్లు
AP /TS - 43 కోట్లు (GST తో కలిపి)
రెస్టాఫ్ ఇండియా - 7. 70 కోట్లు (తెలుగు + హిందీ)
ఓవర్ సీస్ - 6. 30 కోట్లు
మొత్తం - 57 కోట్లు

కాగా, 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'లూసిఫర్' కి రీమేక్ గా తెరకెక్కించారు. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగు వెర్షన్ లో కొన్ని కీలక మార్పులు చేశారు. ఇందులో నయనతార - సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించగా.. సముద్రఖని - సునీల్ - తాన్యా రవిచంద్రన్ - మురళీ శర్మ - అనసూయ - బ్రహ్మాజీ - సఫీ - పూరీ జగన్నాథ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి మరియు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీ భూపాల్ సినిమాలో డైలాగ్స్ రాయగా.. ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. ఐటెం సాంగ్ కు చోటా కె.నాయుడు కెమెరామెన్ గా వ్యవహరించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News