'హిట్ 2' హీట్ పుట్టించేది ఎప్పుడంటే..?

Update: 2022-09-16 03:58 GMT
వర్సటైల్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''హిట్: ది సెకండ్ కేస్'' (HIT 2). శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా కోసం కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారు.

'హిట్ 2' చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను వదిలారు. ఇందులో శేష్ సిగరెట్ తాగుతూ దేన్నో ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో తెలియజేస్తూ.. 'డిసెంబర్ 2న హీట్' అని శేష్ కామెంట్ పెట్టారు.

2020 లో శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ - రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా రూపొందిన 'హిట్' చిత్రానికి కొనసాగింపుగా ''హిట్ 2'' సినిమా తెరకెక్కింది. ఇందులో హిట్ (హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి పాత్రలో అడివి శేష్ కనిపించనున్నారు.

ఫస్ట్ పార్ట్ లో కథంతా తెలంగాణ ప్రాంతంలో జరిగినట్లు చూపించగా.. ఇప్పుడు రెండో కేసును ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా.. కోమలీ ప్రసాద్ - రావు రమేష్ - పోసాని కృష్ణ మురళి - భాను చందర్ - తనికెళ్ళ భరణి ఇతర పాత్రలు పోషించారు.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ వెంకటరత్నం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతం సమకూర్చారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'హిట్ 2' ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మేజర్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అడివి శేష్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News