వరుసగా నాలుగు రోజులు బాక్సాఫీస్‌ జాతరే

Update: 2023-01-10 11:07 GMT
సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు మొత్తం అయిదు సినిమాలు రాబోతున్నాయి. అందులో నాలుగు స్టార్‌ హీరోల సినిమాలు కాగా ఒకటి చిన్న సినిమా. సంక్రాంతి సందడి రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. జనవరి 11 అయిన రేపు తమిళ్ స్టార్‌ హీరో అజిత్ నటించిన తునివు తెలుగు లో తెగింపుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించడం ఖాయం అన్నట్లుగా తమిళ ప్రేక్షకులు ఉన్నారు. పోటీ లేదు కనుక రేపు తెలుగు బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెగింపు తర్వాత నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 12వ తారీకున బాలయ్య మాస్ జాతర మొదలు కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వీర సింహారెడ్డి సినిమాను జనవరి 12వ తారీకున ఎంజాయ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా సోలోగా రాబోతున్న నేపథ్యంలో ఆ రోజున మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా కోసం థియేటర్ల ముందు క్యూ కట్టడం కన్ఫర్మ్‌.

ఇక చివరగా తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వారసుడు సినిమా కు పోటీగా సంతోష్‌ శోభన్‌ నటించిన కళ్యాణం కమనీయం సినిమా విడుదల కాబోతుంది. రెండు సినిమాలకు కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చేలా థియేటర్లను షేర్‌ చేసుకుంటున్నారు.

మొత్తానికి అయిదు సినిమాలు కలిసి నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సందడి మరో రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఏ సినిమా దక్కించుకుంటుంది.. ఏ సినిమా కమర్షియల్‌ గా సక్సెస్ అవుతుంది అనేది విడుదల అయ్యాక వచ్చిన టాక్ ను బట్టి ఉంటుంది. కానీ మొదటి రోజు మాత్రం సాధ్యం అయినంత వరకు భారీ కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News