చెన్నై మొదటి వడ కుదిరిందా

Update: 2018-10-17 07:24 GMT
ధనుష్ హీరోగా కల్ట్ మూవీస్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ రూపొందించిన వడ చెన్నై ఇవాళ విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ తో విపరీతమైన అంచనాలతో వచ్చిన ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ధనుష్ కు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవడంతో పాటు ఇందులో కాన్సెప్ట్ మొత్తం తమిళ నేటివిటీతో ఉండటంతో డబ్బింగ్ చేసే ప్రయత్నం జరగలేదు. ఇక రిపోర్ట్ విషయానికి వస్తే మూడు భాగాల వడ చెన్నై సిరీస్ లో ఇది మొదటిది.

ఇది నార్త్ చెన్నైలోని వెనుకబడిన బెస్తవారి వర్గాల నేపధ్యాన్ని తీసుకుని చాలా రీసెర్చ్ చేసి వెట్రిమారన్ ఈ కథ రాసుకున్నాడు. పేదవారి పేటలను ఆక్రమించుకుని వాటిని బహుళ స్థాయి కంపెనీలకు ధారాదత్తం చేసి ఉన్న గూడును కూడా పోగొట్టే క్రమంలో ఎంతటి దారుణమైన ఆటలు ఆడతారో కళ్ళకు కట్టినట్టు చూపించాడు వెట్రి. ఇందులో ధనుష్ పోషించిన పాత్ర పేరు అన్బు. నలుగురు గ్యాంగ్ స్టర్స్ మధ్య జరిగిన ఆధిపత్య పోరాటంలో తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన యువకుడిగా ప్రాణం పోసాడు.

ఇది రంగస్థలం తరహాలో 1980 నేపధ్యంతో మొదలై 2003 దాకా ప్రయాణిస్తూ ఎక్కడికక్కడ కథను లింక్ చేస్తూ వివరించే ప్రయత్నం బాగా కుదిరింది. కాకపోతే వెట్రిమారన్ తన రీసెర్చ్ లో తెలుసుకున్న విషయాలన్నీ సినిమాలో చూపించే తీరాలి అనే తలంపుతో ఇది మూడు భాగాలుగా తీయడం కొంత ఇబ్బంది కలిగించేదే. నిడివి కేవలం రెండు గంటలు పాటే ఉన్నా చాలా చోట్ల ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. వెబ్ సిరీస్ తరహా ఫీలింగ్ కలిగినా తనకు మాత్రమే సాధ్యమయ్యే టెక్నిక్ తో వెట్రిమారన్ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. గ్యాంగ్ స్టర్స్ సముతిర ఖని-కిషోర్-పవన్-దీనా బెస్ట్ ఇచ్చారు.

హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్-ఆండ్రియా జేరిమియాలు న్యాచురల్ గా బాగా కుదిరారు. దర్శకత్వ ప్రతిభతో నిలబడిన వడ చెన్నై మిగిలిన రెండు భాగాలు ఇంత కన్నా మెరుగ్గా ఉంటేనే సీక్వెల్స్ పరంగా అరుదైన ఘనత అందుకుంటాయి. కానీ ఇంత ఊర తమిళ నేటివిటీ మన ప్రేక్షకులు అంగీకరించడం కష్టం కాబట్టి వడ చెన్నై తెలుగులో వచ్చే అవకాశాలు తక్కువే. అందులోనూ మూడు భాగాలు అంటే చెప్పేదేముంది.
Tags:    

Similar News