వరలక్ష్మీ శరత్ కుమార్ ఏకంగా బన్నీతోనే పెట్టుకుంటోందే!

Update: 2021-03-01 09:30 GMT
వరలక్ష్మీ శరత్ కుమార్ .. ఇప్పుడు ఈ పేరును గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ముందుగా తమిళ సినిమాలకి తన అందమైన విలనిజాన్ని రుచి చూపించిన వరలక్ష్మీ శరత్ కుమార్, నెమ్మదిగా టాలీవుడ్లో పవర్ ఫుల్ విలనిజానికి కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్లోకి అడుగుపెట్టక ముందే ఆమెకి ఇక్కడ అభిమానులు ఉన్నారంటే, ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిండుగా .. నిబ్బరంగా .. విశాలమైన కళ్లతో ఆమె పలికించే అభినయాన్ని చాలామంది ఇష్టపడతారు. అందువల్లనే తెలుగులో ఆమె జోరు పెరుగుతోంది.

'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మీ, 'క్రాక్' సినిమాతో తన అభిమానుల జాబితాలో మరింత మందిని చేర్చుకుంది. ఆ తరువాత వచ్చిన 'నాంది' సినిమా కూడా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. అలా ఈ ఏడాది ఆరంభంలోనే తెలుగులో ఆమె రెండు విజయాలను సొంతం చేసుకుంది. పాత్ర పరంగా ప్రశంసలను అందుకుంది. అలాంటి వరలక్ష్మీ మరోసారి విలన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అది కొరటాల సినిమా కావడం .. ఆ సినిమాలో బన్నీ హీరో కావడమే ఇక్కడి విశేషం.

ప్రస్తుతం కొరటాల శివ .. చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. మే 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత కొరటాల సినిమా బన్నీతో ఉండనుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న 'పుష్ప' సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా థియేటర్లపై దండయాత్ర చేయనుంది. ఈ సినిమా తరువాత కొరటాల - బన్నీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. పొలిటికల్ టచ్ తో రూపొందనున్న ఈ సినిమాలో, స్టూడెంట్ లీడర్ పాత్రలో బన్నీ కనిపిస్తాడట. ఇక ఆయన ఆటకట్టించడానికి ప్రయత్నించే విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుందని అంటున్నారు. వరలక్ష్మీ వచ్చే ఏడాదిలో మరోసారి తన విలనిజాన్ని రుచి చూపించనుందన్న మాట.
Tags:    

Similar News