'వీరమల్లు' గుర్రపుస్వారీ గుండెలను దడదడలాడించేస్తుందట!

Update: 2021-03-14 05:30 GMT
పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతంలో కంటే ఇప్పుడు ఆయన కొత్త కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలిసారిగా చారిత్రక చిత్రం చేయడానికి అంగీకరించాడు .. అదే 'హరిహర వీరమల్లు'. ఎ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలోనూ .. పవన్ లుక్ విషయంలోను అభిమానులు సంతృప్తికరంగా ఉన్నారు. పవన్ నుంచి రానున్న భారీ సినిమా కావడంతో అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ కథ 17వ శతాబ్దంనాటి కాలంలో జరుగుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనాకాలంలో నడుస్తుంది. అందువలన అందుకు సంబధించిన చారిత్రక పరమైన సెట్లను నిర్మిస్తూ వెళుతున్నారు. ఒక వైపున ఒక సెట్లో షూటింగు జరుగుతూ ఉండగా, మరో వైపున ఇతర సెట్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ సినిమాలో పవన్ 'వీరమల్లు' అనే బందిపోటుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. రాజుల కాలం .. పైగా పాత్ర పరంగా పవన్ బందిపోటు. అందువలన తెరపై గుర్రాల హడావిడి ఎక్కువగా ఉంటుందట. ఇందుకోసం పెద్ద సంఖ్యలో మేలుజాతి గుర్రాలను తెప్పించారని అంటున్నారు.

బందిపోటుగా పవన్ దోపిడీ చేసేసి పారిపోవడం .. సైనికులు ఆయనను వెంటాడం గుర్రాలపైనే ఉంటుంది. గుర్రాలపై ఈ ఛేజింగ్ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు గుండెలు దడదడలాడిపోవడం ఖాయమట. ఆ స్థాయిలో ఈ ఎపిసోడ్స్ చిత్రీకరణను ప్లాన్ చేశారని చెబుతున్నారు. గుర్రంపై పవన్ దూసుకెళ్లే సీన్స్ అభిమానులకు పండగ చేస్తాయని అంటున్నారు. అద్భుతమైన విజువల్స్ తో ఈ ఎపిసోడ్స్ ను ఆవిష్కరించడానికిగాను పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారట. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆ కాలంనాటి పోరాట 'ముద్ర'లతో ఆశ్చర్యచకితులను చేస్తాయని అంటున్నారు. మొత్తానికి గుర్రాలతో వీరమల్లు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయోననేది, పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తోంది. 
Tags:    

Similar News