టీజర్: వైవిధ్యమైన యాక్షన్ డ్రామాతో వస్తున్న శింబు - గౌతమ్ మీనన్..!

Update: 2021-12-10 11:30 GMT
తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ - స్టార్ హీరో శింబు లది హిట్ కాంబినేషన్. వీరి కలయికలో తెరకెక్కిన 'విన్నై తాండి వరువాయా' 'అచ్చం యెన్బదు మడమైదా' చిత్రాలు (తెలుగులో 'ఏమాయ చేసావే' & 'సాహసం శ్వాసగా సాగిపో') బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించాయి. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ రెండు చిత్రాలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత శింబు - గౌతమ్ మీనన్ - రెహ్మాన్ కలయికలో ''వెందు తనింధతు కాదు'' అనే హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోంది.

ఇప్పటికే విడుదలైన ''వెందు తనిందంతు కాడు'' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో శింబు లుంగీ కట్టి చిరిగిన చొక్కాతో చేతిలో ఓ దోటి పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో నేడు శుక్రవారం టీజర్ ను డైరెక్టర్ గౌతమ్ మీనన్ లాంచ్ చేశారు. టీజర్ చూస్తుంటే.. ఇది చెన్నై నగరంలో వలస కార్మికుడి కష్టాల నేపథ్యంలో యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.

తన స్వగ్రామంలోని పరిస్థితులు వ్యవసాయానికి ప్రతికూలంగా మారడంతో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలని నగరానికి వచ్చిన యువకుడు ముత్తు పాత్రలో శింబు కనిపించారు. అయితే శ్రామిక శక్తిని దోపిడీ చేసే కొందరు వ్యక్తుల వల్ల ముత్తు నేర ప్రవృత్తిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనను తాను కాపాడుకోవడానికి ఆయుధం కూడా చేతబట్టినట్లు కనిపిస్తోంది.

'వెందు తనింధతు కాదు' యాక్షన్ టీజర్ మొత్తాన్ని ఓ సాంగ్ నేపథ్యంలో చూపించారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట హీరో అనుభవించే బాధను తెలియజేస్తూ సాగింది. సెన్సిబుల్ ప్రేమకథలకు పేరుగాంచిన గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ఈసారి వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రాబోతున్నాడని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అంతేకాదు ఆయన మొదటిసారి అణగారిన వర్గాల కథను చెప్పపోతున్నట్లు తెలుస్తోంది.

శింబు తన కెరీర్ లో ఇంతకముందు ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో నటిస్తున్నారని టీజర్ చూసి చెప్పొచ్చు. ఇందులో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. మలయాళ నటులు నీరజ్ మాధవ్ - సిద్ధిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. మరి రెహమాన్ - శింబు - గౌతమ్ కాంబినేషన్ లో మరో మైలురాయి అవుతుందో లేదో చూడాలి.

''వెందు తనింధతు కాదు'' చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి కె. గణేష్ నిర్మిస్తున్నారు. జయమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంటోనీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇటీవల 'మానాడు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శింబు.. తన కెరీర్ లో వస్తున్న ఈ 47వ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Full View
Tags:    

Similar News