హీరోగా 36 రన్స్ పూర్తిచేసిన వెంకీ!

Update: 2022-08-14 13:30 GMT
వెంకటేశ్ .. బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చారు. వెంకీ సినిమాల్లోకి రావడానికి ముందునుంచే రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్. అయినా బాలనటుడిగా వెంకీ చేసింది ఒక సినిమానే. చదువు పూర్తయిన తరువాతనే వెంకటేశ్ ను సినిమాల వైపుకు తీసుకుని రావాలని రామానాయుడు అనుకున్నారు. వెంకటేశ్ కూడా చదువుపైనే దృష్టి పెట్టారు. వెంకటేశ్  ఫారిన్ లో చదువును పూర్తి చేసే స్థాయికి వచ్చారు. అప్పుడు హీరోగా చేయడానికి వచ్చేయమని ఆయనకి తండ్రి నుంచి కాల్ వెళ్లింది. అంతే వెంకటేశ్ ఇండియాలో వాలిపోయారు.

రామానాయుడు సూపర్ స్టార్ కృష్ణతో ఒక సినిమా చేయాలనుకున్నారు. ఆ సినిమాకి రాఘవేంద్రరావుని దర్శకుడిగా అనుకున్నారు. కానీ కృష్ణ బిజీగా ఉండటం వలన ప్రాజెక్టు ఆలస్యమయ్యేలా ఉంది. రాఘవేంద్రరావు ఇచ్చిన డేట్స్ లోనే తన బ్యానర్ లో సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న రామానాయుడు, హీరోగా వెంకటేశ్ ను రంగంలోకి దింపాలని భావించారు. అందుకే ఆయనను పిలిపించారు. ఈ లోగానే పరుచూరి బ్రదర్స్ కథను సిద్ధం చేసేశారు. ఆ సినిమానే 'కలియుగ పాండవులు'.

ఈ సినిమాతో కథానాయికగా ఖుష్బూను .. ప్రతినాయకుడిగా శక్తికపూర్ టాలీవుడ్ కి పరిచయం చేశారు.1986 ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. 14 కేంద్రాలలో 50 రోజులను పూర్తి చేసుకుంది. విజయవాడలో 100 రోజుల వేడుకను జరుపుకుంది.

అలా తొలి సినిమాతోనే వెంకటేశ్ సక్సెస్ ను అందుకున్నారు. తన తొలి సినిమా ఈ రోజుతో 36 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంటే హీరోగా వెంకటేశ్ 36 వసంతాలను పూర్తిచేసుకున్నాడన్న మాట. ఎంత బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇక్కడ నిలబడాలంటే సామాన్య ప్రేక్షకుడిని మెప్పించవలసిందే.

అలా వెంకటేశ్  సినిమాకి .. సినిమాకి తనని తాను మార్చుకుంటూ, డైలాగ్ డెలివరీలో .. డాన్సులలో .. ఫైట్లలో .. బాడీ లాంగ్వేజ్ లో మార్పులు చేసుకుంటూ .. ఎదుగుతూ వచ్చారు. స్టార్ హీరోలలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

చంటి .. బొబ్బిలిరాజా .. ప్రేమ ..  స్వర్ణకమలం వంటి సినిమాలు  ఆయన కెరియర్ కి బలమైన  పునాదులు వేస్తూ ముందుకు నడిపించాయి. ఒక్కసారి వెంకీ వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు కనిపిస్తాయి. ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ విక్టరీ అనేది ఆయన ఇంటి పేరుగా మాత్రమే వినిపిస్తుంది.
Tags:    

Similar News