అల్లుడితో జాయిన్‌ కాబోతున్న వెంకీ మామ

Update: 2018-12-07 04:32 GMT
విక్టరీ వెంకటేష్‌ - నాగచైతన్యల కాంబోలో మల్టీస్టారర్‌ మూవీ గురించి గత సంవత్సర కాలంగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్‌ లో మూవీ పట్టాలెక్కింది. జైలవకుశ చిత్రంతో సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు బాబీ ఈ మల్టీస్టారర్‌ కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. గత నెల 17వ తారీకున చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి కూడా నాగచైతన్య మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. చైతూపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

తాజాగా ఈ చిత్రంలో వెంకీ కూడా జాయిన్‌ కాబోతున్నాడు. తాజాగా ‘ఎఫ్‌ 2’ చిత్రం షూటింగ్‌ ముగించుకున్న వెంకటేష్‌ అతి త్వరలోనే అల్లుడితో కలిసి షూటింగ్‌ లో జాయిన్‌ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి వరకు ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్‌ ను నిర్వహించబోతున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ లో ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. వెంకీ మామ అనే టైటిల్‌ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. పల్లెటూరులో మామ - అల్లుడుల కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా హుమా క్యూరేషి మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ కు సినిమాను విడుదల చేసే ఆలోచనలో వెంకీ మామ అండ్‌ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News