టీవీ ఛానెల్ మీద వేణుమాధవ్ కేసు

Update: 2016-05-10 09:45 GMT
ఒకప్పటి స్టార్ కమెడియన్ వేణు మాధవ్ చాన్నాళ్ల తర్వాత వార్తల్లోకి వచ్చాడు. ఐతే అతను సినిమాకు సంబంధించిన సంగతులతో వార్తల్లోకి రాలేదు. ఓ టీవీ ఛానెల్ మీద కేసు పెట్టడం ద్వారా వెలుగులోకి వచ్చాడు వేణుమాధవ్. సెలబ్రెటీల్ని బతికుండగానే చంపేయడం అలవాటైన సోషల్ మీడియా.. వేణుమాధవ్ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే సాగించింది. అతను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని నమ్మేసి ఓ టీవీ ఛానెల్‌ ఈ వార్తను టెలికాస్ట్ చేసింది. దాంతో పాటు రెండు వెబ్ సైట్లు సైతం ఈ వార్తను ప్రచురించాయి. ఐతే చాలామంది లాగా ఓ ఖండన ఇచ్చేసి ఊరుకోకుండా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు వేణుమాధవ్.

తాను చనిపోయినట్లు వార్తలు వేసిన న్యూస్ ఛానెల్.. వెబ్ సైట్ల మీద కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు వేణు మాధవ్. దీనిపై మీడియాతో మాట్లాడేందుకు అతను నిరాకరించాడు. సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక వస్తున్న తలనొప్పి ఇది. ఎవరో ఒకరు ఓ సెలబ్రెటీ గురించి ఇలా దుష్ప్రచారం మొదలుపెట్టడం.. దాన్ని ముందు వెనక చూసుకోకుండా మిగతావాళ్లు ప్రచారంచేయడం మామూలైపోయింది.

ఇంతకుముందు తమిళ కమెడియన్ మనోరమ విషయంలో ఇలాగే జరిగింది. ఈ మధ్య సెంథిల్ గురించి కూడా ఇలాగే ప్రచారం చేశారు. దీనిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పుకోవాల్సి వచ్చింది. మన స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ చనిపోయే ముందు కూడా ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది.
Tags:    

Similar News