ఔను.. కళ్లు తిరిగిపడిపోయాను-వేణుమాధవ్

Update: 2016-05-29 07:47 GMT
రెండు మూడేళ్లుగా అస్సలు వార్తల్లో లేని కమెడియన్ వేణుమాధవ్ ఈ మధ్య ఉన్నట్లుండి వార్తల్లోకి వచ్చేశాడు. తాను చనిపోయానంటూ దుష్ప్రచారం చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల్ని మాత్రమే కాదు.. మంత్రిని.. గవర్నర్ ని సైతం కలవడంతో వేణు ఇంత ఆవేశపడిపోతున్నాడేంటబ్బా అని జనాలు ఆశ్చర్యపోయారు. ఐతే తాను చనిపోయానన్న వార్తలతో తీవ్ర మనోవేదన అనుభవించాకే తాను ఇలా స్పందించాల్సి వచ్చిందని అంటున్నాడు వేణుమాధవ్.

‘‘నేను చనిపోయానన్న వార్తలతో మా అమ్మ.. నా భార్యా పిల్లలు మామూలుగా బాధపడలేదు. నావాళ్లందరూ తీవ్ర మనోవేదన అనుభవించారు. ఏమైందంటూ కొన్ని వేల ఫోన్లు వచ్చాయి. ఫోన్ ఆఫ్ చేసేద్దామా అనుకున్నా.. నా గురించి జరిగిన ప్రచారమే నిజమనుకుంటురేమో అని భయం. కొందరు ఫోన్లు చేసి ‘థర్డ్ డే’ ఎప్పుడు.. ‘లెవెన్త్ డే’ ఎప్పుడు అని కూడా అడిగారు. అలాంటపుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇంతకుముందు కూడా నాకు తలనొప్పి అని.. కాళ్లు చచ్చుపడిపోయాయని.. క్యాన్సర్ వచ్చిందనీ ప్రచారం చేశారు. లైట్ తీసుకున్నా.. కానీ ఈసారి ఏకంగా చనిపోయానని ప్రచారం చేశారు. అందుకే హర్ట్ అయి అలా రియాక్టయ్యాను’’ అని వేణు మాధవ్ వెల్లడించాడు.

‘రచ్చ’ షూటింగ్ సందర్భంగా తాను కళ్లు తిరిగి పడిపోయానన్న ప్రచారం నిజమేనని వేణుమాధవ్ చెప్పాడు. ‘‘ఆ విషయం అబద్ధమేమీ కాదు. ఆ టైంలో ఉదయం చరణ్ సినిమా చేస్తూ.. మధ్యాహ్నం మరో సినిమా.. రాత్రికి ఇంకో సినిమా షూటింగులో పాల్గొంటున్నా. అది ఎండా కాలం. సరిగా తిండి కూడా తినకపోవడంతో ఒత్తిడికి కళ్లు తిరిగి పడిపోయాను. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సెలైన్ ఎక్కించారు. తర్వాత షూటింగుకి వచ్చేశాను. కానీ ఏవేవో కథలు అల్లేశారు’’ అని వేణుమాధవ్ చెప్పాడు.
Tags:    

Similar News