ప్రముఖ క్యారెక్టర్ నటి సన తనయుడు సయ్యద్ అన్వర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్వర్ బుల్లితెర నటి సమీర షరీఫ్ ని వివాహమాడారు. ఈ జంట వివాహం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఇద్దరూ చాలా కాలంగా స్నేహితులు. కలిసి తమిళ బుల్లితెరపై అనేక సీరియళ్లలో నటించారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రణయానికి గుర్తుగా అన్విరా పేరుతో ఇన్ స్టాగ్రమ్ లో రకరకాల సంగతుల్ని అభిమానులకు షేర్ చేస్తుంటారు.
సయ్యద్ అన్వర్- సమీర జంట వివాహం కొద్దిమంది బంధుమిత్రులు స్నేహితుల సమక్షంలో ఎంతో నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలో సందడి చేస్తోంది. దీనిని సన ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లోనూ షేర్ చేస్తున్నారు.
ఇక క్యారెక్టర్ నటి సన క్రేజు గురించి తెలిసిందే. బుల్లితెర - వెండితెర అనే తేడా లేకుండా అన్నిచోట్లా రాణించారు. పూరి-కృష్ణవంశీ- వైట్ల సహా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లు సనకు విరివిగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. ఇప్పటికీ నాన్ స్టాప్ క్యారెక్టర్ నటిగా కొనసాగుతుండడం ఆసక్తికరం.