పాత్ర‌ల మ‌తాల్ని మార్చినా క‌థ మార్చ‌లేక దొరికిపోయారు!

Update: 2021-06-21 01:30 GMT
ఓటీటీ సిరీస్ ల‌కు సంబంధించిన వివాదాలు అంత‌కంత‌కు అగ్గి రాజేస్తూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేసిన‌ విద్యాబాలన్ షెర్ని వివాదాస్ప‌ద‌మైంది. ఈ చిత్ర క‌థాంశం వివాదాల్లోకి వ‌చ్చింది. భారతదేశపు ప్రముఖ వేటగాడు నవాబ్ షఫత్ అలీ ఖాన్ చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసు పంపడంతో వివాదం రాజుకుంది.

ఈ చిత్రం నిజఘ‌టనల ఆధారంగా తెర‌కెక్కినా ఆ విష‌యాన్ని ఎక్క‌డా ప్ర‌చారంలో చెప్ప‌లేదు. కానీ సోషల్ మీడియాలో ఈ మూవీ క‌థాంశం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం 2018 లో మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో కాల్చి చంపబడిన పులి అవని వేటను తెర‌పై ఆవిష్క‌రించింది. హైదరాబాద్ వేటగాడు నవాబ్ షఫత్ అలీ ఖాన్ అతని కుమారుడు అస్గర్ ఈ ఆపరేషన్ నిర్వహించారు. కానీ ఈ చిత్రం లో వేట‌లో పాల్గొనేవాడిగా పింటుజీ అనే వేరే వ్యక్తిని చూపించారు. ఒక హిందువును వేటగాడిగా చూపించారని అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది.

న్యూటన్ చిత్రానికి దర్శకత్వం వహించిన అమిత్ మసుర్కర్ `షెర్ని`కి దర్శకత్వం వహించారు. నిజానికి రియ‌ల్ స్టోరీలో ఒక ముస్లిమ్ ఆ పాత్ర‌లో ఉండ‌గా తెర‌పై హిందువుగా మార్చి చూపించారు. అలాగే జిల్లా అటవీ అధికారిని క్రైస్తవునిగా చిత్రీకరించారు. కానీ వాస్తవానికి అత‌డు ఒక‌ హిందువు. కానీ నిజాల్ని దాచి పాత్ర‌ధారుల మ‌తాల్ని మార్చారు.

అవ‌నీ మ‌నుషుల్ని చంపి తినే పులి. ఆ పులిని త‌ట‌స్థ‌ప‌ర‌చాల్సిందిగా నవాబ్ షఫత్ అలీ ఖాన్- అస్గర్ ల‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. ట్రైలర్ చూసిన అనంత‌రం ఆ క‌థ త‌మ‌దేన‌ని భావించిన నవాబ్ అలీ ఖాన్ కోర్టు నోటీసులు పంపారు. ఇది పూర్తిగా వినోద ప్రయోజనాల కోసం ఎంచుకున్న క‌థ అని ఇత‌ర ఉద్ధేశాలేవీ లేవ‌ని మేక‌ర్స్ అన్నారు. అయితే ఒరిజిన‌ల్ క‌థ వాస్త‌విక లోపాల‌తో క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.




Tags:    

Similar News