తననలా చూపించొద్దంటున్న కామెడీ నటి

Update: 2018-09-04 14:30 GMT
ఇప్పుడు కామెడీ అంతా బాడీ షేమింగ్ మీదే నడుస్తోంది. ‘జబర్దస్త్’లో పేలే ప్రతి జోకూ దాని మీదే ఉంటుంది. ‘జబర్దస్త్’లో ప్రతి స్కిట్ కూడా అందులోని కమెడియన్ల రూపాల మీదే ఉంటుంది. సినిమాల్లో సైతం ఇదే ట్రెండు కంటిన్యూ అవుతోంది. దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. తమిళ.. తెలుగు భాషల్లో కమెడియన్ గా మంచి పేరే సంపాదించిన విద్యుల్లేఖ రామన్ విషయానికొస్తే ప్రధానంగా ఆమె మీద బాడీ షేమింగ్ జోకులు పేలుతుంటాయి.  దీనికి తోడు ఆమెను ఈ మధ్య ప్రతి సినిమాలోనూ తిండిపోతుగా చూపించడం మామూలు అయిపోయింది. తాజాగా ‘పేపర్ బాయ్’ సినిమాలోనూ విద్యును అలాగే చూపించారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రచురితమైన ఒక కథనంపై విద్యుల్లేఖ స్పందించింది.

బాడీ షేమింగ్ జోక్స్ తనకూ ఇష్టం ఉండదని.. కానీ తప్పక చేయాల్సి వస్తోందని విద్యు అంది. ఐతే సినిమాల్లో ఈ మధ్య చాలా మార్పు వస్తోందని.. ఇలాంటివి కూడా మారాలని ఆమె అంది. ‘సరైనోడు’ తెలుగులో తనకు అతి పెద్ద హిట్.. చాలా పేరు తెచ్చిన సినిమా అని.. కానీ అందులో బాడీ షేమింగ్ జోక్స్ ఏమీ ఉండవని ఆమె అంది. ‘రాజు గారి గది’ కూడా మంచి విజయం సాధించిందని.. కానీ అందులోనూ తనపై బాడీ షేమింగ్ జోక్స్ ఉండవని విద్యు తెలిపింది. ఇంకా ఇలాంటి ఉదాహరణలు మరి కొన్ని ఉన్నాయని ఆమె అంది. ఈ విషయంలో విద్యుల్లేఖ ఆవేదన అర్థం చేసుకోదగినదే. ప్రతి సినిమాలోనూ తనను తిండి పోతుగా చూపిస్తూ.. బాడీ షేమింగ్ జోకులు పేలుస్తుంటే ఏ ఆర్టిస్టుకైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి కామెడీలో విశేషం ఏముంది? మంచి పెర్ఫామర్ అయిన విద్యుకు ఆమె టాలెంటుకు తగ్గ పాత్రలు ఇవ్వడానికి ఇక నుంచైనా రచయితలు.. దర్శకులు ప్రయత్నిస్తే మంచిది.

Tags:    

Similar News