సినిమా ఇండస్ట్రీకి పెద్ద సినిమా చిన్న సినిమా అనే తారతమ్యాలు ఏమీ లేకుండా.. ఉమ్మడి సమస్య ఏదైనా ఉందంటే అది కచ్చితంగా పైరసీ అనే చెప్పాలి. వందల కోట్లతో తీసిన సినిమా అయినా, అతి చిన్న సినిమా అయినా.. విడుదలయిన 12గంటల్లోనే పైరసీ అయిపోవడం, వీలైతే అదే రోజు, కాకపోతే మరుసటిరోజు ఆన్ లైన్ లో ప్రత్యక్షమవడం జరుగుతుంది. ఈ విషయంపై ఆయా సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పైరసీ చూడటం నేరం - కిల్ పైరసీ - పైరసీ సినిమాలను దూరంగా పెట్టండి - ఇండస్ట్రీకి కాపాడండి అంటూ రకరకాల స్లోగన్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ముంబయి హై కోర్టు స్పందించింది.
ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం ఏమీ నేరం కాదని ముంబయి హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ గౌతమ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. అయితే వీటిని పబ్లిక్ గా చూడటం, డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఇతరులకు షేర్ చేయడం వంటివి మాత్రం నేరం కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది. ఈ మధ్యకాలంలో పైరసీ మరీ ఎక్కువైపోయిందని, దాంతో తాము చాలా నష్టపోతున్నామని ముంబయి ఫిల్మ్ ప్రొడ్యూసర్ల సమాఖ్య ముంబయి హైకోర్టులో కేసు వేసింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు.. పైరసీ సినిమాలు చూడటాన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది.
అయితే ఈ మధ్యకాలంలో పైరసీ సినిమాలు అందించే కొన్ని వెబ్ సైట్లను బ్లాక్ చేయమని ముంబయి హైకోర్టు ఐఎస్‌పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన కొన్ని మామూలు వెబ్ సిట్లకు కూడా దెబ్బ రావడంతో పైరసీ వీడియోలు చూసే సైట్ లోకి వెళ్లేముందు ఎర్రర్ మెసేజ్ ప్రత్యక్షమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఐఎస్‌పీలకు సూచించింది.