తమిళనాట ఆడియో ఫంక్షన్స్ భలే ఉంటాయి. అక్కడ స్టార్స్ కానీ, అభిమానులు కానీ భలే పంక్చువాలిటీ పాటిస్తారు. ఇక్కడైతే పాటల విడుదల వేడుకలోకి హీరో ఎంట్రీ ఇచ్చే విధానం ఆల్ మోస్ట్ సినిమాలోలాగే ఉంటుంది. ముందే వచ్చి కూర్చుంటే కిక్కేముంటుందబ్బా అనుకొంటారో ఏంటో తెలియదు కానీ... సగం వేడుక అయ్యాక మధ్యలో ఎంట్రీ ఇచ్చేస్తాడు హీరో. అభిమానులు ఎంతగా ఎదురు చూస్తే అంత మేలనేది వాళ్ల అభిప్రాయం కావొచ్చు. కానీ తమిళనాట అలా కాదు. హీరోలు అందరికంటే ముందే వస్తుంటారు. అతిథుల్ని - అభిమానుల్ని స్వయంగా వేడుకలోకి ఆహ్వానిస్తుంటారు. మొన్నామధ్య `పులి` పాటల వేడుకలో స్టార్ కథానాయకుడైన విజయ్ ఒక బౌన్సర్ లా గేట్ దగ్గర నిలబడి అందరినీ లోపలికి ఆహ్వానించాడట. అందరూ లోపలికొచ్చాక ఆయన వచ్చి కూర్చున్నాడట. ఆల్మోస్ట్ అక్కడి హీరోలంతా అంతేనట. కానీ తెలుగులో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది వ్యవహారం. ఆ విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న తేరి ఆడియో ఫంక్షన్ లోకి విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. అతిథులకంటే ముందే వచ్చి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. అభిమానులకీ అభివాదం చేస్తున్నాడు. మరి మన పవర్ స్టార్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక వచ్చేసేయ్ పవన్...!!