40 కథలు రెడీ అంటున్న స్టార్ రైటర్

Update: 2015-11-05 11:30 GMT
బాహుబలి, భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథ అందించి.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా మారిపోయాడు విజయేంద్ర ప్రసాద్. ఆయన కథ ఇస్తానంటే కోట్లు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారిప్పుడు. ఐతే ఆయన్ని ఎవరైనా అడిగారో లేదో కానీ.. తన దగ్గర 40 కథలు రెడీగా ఉన్నాయంటున్నాడు విజయేంద్ర ప్రసాద్. కథలు తయారు  చేయడం అన్నది నిరంతర ప్రక్రియ అని.. తన అసిస్టెంట్లతో కలిసి ఇలా 40 కథలు సిద్ధం చేశానని.. వాటిలో ఎన్ని తెరమీదికి వెళ్తాయో.. ఏది ఎప్పుడు అవసరానికి వస్తుందో చెప్పలేనని అంటున్నాడు విజయేంద్ర ప్రసాద్.

సినిమా ఎవరు చేస్తారు, ఏ కథ ఎవరికి సూటవుతుంది.. అని ఆలోచించకుండా తనకు వచ్చిన ఆలోచనలన్నింటితో కథలు తయారు చేయడం తనకు  అలవాటని.. అలా రాసిన కథలు 40 దాకా ఉన్నాయని అంటున్నాడు పెద్దాయన. మరి కథల కొరతతో అల్లాడుతున్న టాలీవుడ్ దర్శకులు ఓసారి విజయేంద్ర ప్రసాద్ ను సంప్రదిస్తే మేలేమో. విజయేంద్ర ప్రసాద్ అంటే రాజమౌళి సినిమాలకు తప్ప వేరే ఎవరికీ కథలు రాయడన్న అభిప్రాయంతో సైలెంటుగా ఉన్నట్లున్నారు టాలీవుడ్ జనాలు.

ఇక బాహుబలి-ది కంక్లూజన్ విశేషాల గురించి మాట్లాడుతూ.. తొలి పార్ట్ కంటే కూడా ఇందులో ఎమోషనల్ డెప్త్, భారీ తనం ఎక్కువ ఉంటాయని.. తొలి భాగంలో సమాధానాలు చిక్కని అన్ని ప్రశ్నలకూ జవాబులిచ్చామని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి చెప్పినట్లే బాహుబలి-3 ఉంటుందని.. కానీ దానికి బాహుబలి-1 - 2లతో సంబంధం ఉండదని ఆయన చెప్పారు.
Tags:    

Similar News