ఆ హీరోలో డైమండ్‌ ను చూశా- విజయేంద్ర

Update: 2016-08-01 07:35 GMT
విజయేంద్ర ప్రసాద్ దేశంలో ప్రస్తుతం నెంబర్ వన్ రైటర్ అంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఈ విషయాన్ని బాలీవుడ్ వాళ్లు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. గత ఏడాది బాహుబలి.. భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారాయన. అలాంటి రచయిత అయితేనే తన కొడుకు నిఖిల్ కుమార్ ను హీరోగా నిలబెట్టగలడని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం ఏరికోరి ఆయనతో కథ రాయించుకున్నాడు.

నిఖిల్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’కు స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాదే. ఆయన దగ్గర శిష్యరికం చేసిన మహదేవ్ (మిత్రుడు డైరెక్టర్) ఈ చిత్రాన్ని రూపొందించాడు. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దీని టీజర్ కూడా నిన్న హైదరాబాద్ లో అతిరథ మహారథుల మధ్య విడుదల చేశారు. టీజర్ చూస్తే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. నిఖిల్ టీజర్లో వీర విన్యాసాలు చేశాడు.

టీజర్ రిలీజ్ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నిఖిల్ హీరోగా మంచి పొజిషన్ కు వెళ్తాడని అంచనా వేశారు. ‘‘నిఖిల్ కోసం క‌థ రాయ‌మ‌ని న‌న్ను పిలిచిన‌ప్పుడు క‌న్నడ సినిమాకు నేను క‌థ రాయాలా అనే ఆలోచ‌న‌తోనే కుమార‌స్వామి గారిని క‌లిశాను. అప్పుడాయన నిఖిల్ కు సంబంధించిన ఓ వీడియో చూపించారు. అది చూసిన త‌ర్వాత ఒక డైమండ్ ను చూసిన ఫీలింగ్ క‌లిగింది. ఈ ప్రాజెక్టు నాకు అప్ప‌గించండి అన్నాను. న‌న్ను న‌మ్మి ఆ ప్రాజెక్టు అప్ప‌గించారు. టీజ‌ర్ చూస్తుంటే నిఖిల్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెలుస్తోంది. నిఖిల్ తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు.. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటాడు’’ అని అన్నారు. మరి నిఖిల్.. విజయేంద్ర ప్రసాద్ నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూద్దాం.
Tags:    

Similar News