సి.కళ్యాణ్ నక్కతోక తొక్కాడుగా..

Update: 2016-09-23 13:30 GMT
ప్రతి ఏటా సినీ ప్రియులు జాతీయ అవార్డుల కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం ఇండియా నుంచి ఎంపికయ్యే సినిమా ఏదని కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం పురస్కారానికి ఇండియన్ ఎంట్రీగా తమిళ సినిమా ‘విసారణై’ ఎంపికైన సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అతడికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆడుగళం’ చిత్రాన్ని రూపొందించిన వెట్రిమారన్ ‘విసారణై’కి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నాడు. చంద్రకుమార్ అనే ఆటో డ్రైవర్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్.

వెనిస్ చిత్రోత్సవంలో ప్రదర్శితమై అవార్డు గెలవడంతో పాటు జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటింది ‘విసారణై’. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. విశేషం ఏంటంటే.. తమిళంలో విడుదలైన ఏడెనిమిది నెలల తర్వాత ఈ మధ్యే ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘విచారణ’ పేరుతో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్. విడుదలకు సన్నాహాలు చేసుకుంటుండగానే ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో పోటీ పడటానికి ఎంపికైంది. ఇది ‘విచారణ’కు కచ్చితంగా కలిసొచ్చే అంశమే. ఇందులో నటీనటులందరూ కొత్తవాళ్లు కావడంతో మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదేమో. ఐతే ఆస్కార్ రేసుకు ఎంపికవడంతో ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలుగులో విడుదలకు మార్గం సుగమం కావడమే కాదు.. ఈ సినిమా మీద ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించే అవకాశముంది. సగం వరకు ఆంధ్రప్రదేశ్ లోనే సాగడం కూడా సినిమాకు కలిసి రావచ్చు. మరి ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News