కళాతపస్వీ 'విశ్వదర్శనం'.. ఆయన భక్తుల కోసం

Update: 2019-02-19 11:18 GMT
తెలుగు సినీ చరిత్రలో కళాతపస్వీ కే విశ్వనాథ్‌ గారు తెరకెక్కించిన చిత్రాలు ఎప్పటికి నిలిచి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో అందుకున్న కళాతపస్వీ కే విశ్వనాథ్‌ గారి జీవిత చరిత్ర ఆధారంగా 'విశ్వదర్శనం' అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నేడు విశ్వనాథ్‌ గారి పుట్టిన రోజు సందర్బంగా 'విశ్వదర్శనం' చిత్ర టీజర్‌ ను విడుదల చేయడం జరిగింది. టీజర్‌ ను విశ్వనాథ్‌ గారి చేతుల మీదుగా విడుదల చేయించారు.

పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో టీ జీ విశ్వ ప్రసాద్‌ నిర్మాణంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి దర్శకత్వంలో 'విశ్వదర్శనం' తెరకెక్కుతోంది. ఎన్నో చిత్రాలకు రచయితగా వ్యవహరించిన జనార్థన మహర్షి, దర్శకుడిగా కూడా మంచి సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు విశ్వనాథ్‌ గారి జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించేందుకు సిద్దం అయ్యాడు. విశ్వనాథ్‌ గారితో పాటు, ఆయనతో వర్క్‌ చేసిన పలువురి వీడియో బైట్స్‌ ను తీసుకుని 'విశ్వదర్శనం' టీజర్‌ పేరుతో విడుదల చేయడం జరిగింది.

విశ్వదర్శనం టీజర్‌ విడుదల సందర్బంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ... దర్శకులందరికి అభిమానులు ఉంటారు, కాని విశ్వనాథ్‌ గారికి మాత్రం అభిమానులు కాకుండా భక్తులు ఉంటారు. ఆయన భక్తుల్లో ఒకరు జనార్థన మహర్షి. ఈ సినిమా తీస్తున్నందుకు డబ్బులు వస్తాయో రావో తెలియదు, కాని తప్పకుండా వారికి కీర్తి మాత్రం వస్తుందన్నారు.

చిన్నప్పుడు అమ్మ చెప్పిన విశ్వనాథ్‌ గారి సినిమాల కథలు వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటి నుండి విశ్వనాథ్‌ గారు దైవం, గురువుతో సమానం. ఆయన వద్ద మూడు సంవత్సరాల పాటు అసిస్టెంట్‌ గా చేశాను. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు రచయితగా వ్యవహరించాను, ఆయనను ఒక సినిమాకు డైరెక్ట్‌ చేసే అవకాశం కూడా నాకు దక్కింది. ఇప్పుడు ఈ సినిమాను తెరకెక్కించే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ దర్శకుడు జనార్థన మహర్షి చెప్పుకొచ్చాడు.


Full View
Tags:    

Similar News