శంకర్ ఫ్యాన్స్ రాజమౌళి ఫ్యాన్స్ వాదులాట

Update: 2018-11-29 09:47 GMT
పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉన్నంతవరకూ మంచిదే.  అనారోగ్యకరమైన పోటీల తోనే వచ్చిన చిక్కంతా.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సృష్టించిన రికార్డులు సాధారణమైనవి కానే కావు. పైగా ఫిలిం మేకింగ్ పరంగా కూడా రాబోయే సినిమాలకు బాహుబలి కొత్త స్టాండర్డ్ సెట్ చేసిపెట్టింది. దీంతో ఏ భారీ చిత్రం రిలీజ్ అవుతున్నా 'బాహుబలి'తో పోలికలు తప్పడం లేదు.

ఇక తాజాగా రిలీజ్ అయిన శంకర్ - రజనీకాంత్ చిత్రం '2.0' కు 'బాహుబలి' రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉందనడం లో ఏ మాత్రం సందేహం లేదు. మొదటి రోజు.. మొదటి వీకెండ్ రికార్డులతో బాహుబలిని దాటే అవకాశాలు ఉన్నాయి గానీ లాంగ్ రన్ లో 'బాహుబలి'ని దాటేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.  కానీ ఇంతలో తమిళ అభిమానులకు తెలుగు అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇరువర్గాలు ట్రోలింగ్ ఇమేజెస్ తో హల్చల్ చేస్తున్నారు.  తమిళ అభిమానులు 'బాహుబలి' రికార్డుల పని అయిపోయిందంటూ వెటకారం చేస్తుంటే.. తెలుగు అభిమానులు మాత్రం వాళ్ళకు  మొదటి రోజే ఏమైంది ఫస్ట్ వీకండ్ తర్వాత కదా చిట్టి రోబో సత్తా బయటపడేది అంటూ సమాధానం ఇస్తున్నారు.   తమిళ అభిమానులు కాస్త అతి చేస్తున్నారని.. అక్కడి కంటే తెలుగులోనే '2.0' ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతోందనే విషయం గుర్తు పెట్టుకొని మాట్లాడాలని అంటున్నారు. 

ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం. సినిమా బాగుంటేనే చూస్తారు.. భారీ కలెక్షన్స్ వస్తాయి. అలా కాకుండా ఉంటే ఎవ్వరూ చూడరు. అది ఎవరి సినిమా అయినా.  అలాంటప్పుడు అనవసరంగా ఈ విషయంలో వాదులాడుకోవడం వల్ల ఏ సినిమాకైనా కలెక్షన్స్ పెరగవు.. తగ్గవు.  రీసెంట్ గా ఆమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' లాంటి సినిమా పరిస్థితి ఏమైందనేది అందరి తెలుసు.  ఇక ఈ ట్రోలింగ్ జనాల ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంటే.. '2.0' పైన ఫన్నీ మీమ్స్ మాత్రం నెటిజనులను అలరిస్తున్నాయి.


Tags:    

Similar News