ఇదే వార్నింగ్ టాలీవుడ్ ఇస్తే..?

Update: 2022-11-22 04:30 GMT
తమిళ అనువాద చిత్రం 'వారసుడు'కు థియేటర్లకు కేటాయింపు వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల మధ్య గొడవగా మారిపోయింది. 2019లో 'పేట' సినిమాకు థియేటర్లకు ఇచ్చే విషయమై గొడవ తలెత్తగా.. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రయారిటీ అని, వేరే భాషా చిత్రాలకు ఎలా థియేటర్లు ఇస్తాం అంటూ 2019లో దిల్ రాజు ప్రశ్నించిన దిల్ రాజు..

ఇప్పుడు తన సినిమా 'వారసుడు'కు ఎక్కువ థియేటర్లు బుక్ చేసి పెడుతున్నాడనే సమాచారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని ఖండిస్తూ నిర్మాతల మండలి ఇచ్చిన ప్రెస్ నోట్‌తో వివాదం ముదిరింది. ఐతే మన ఇండస్ట్రీ లోపలే చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన అంశం కాస్తా ఇప్పుడు కోలీవుడ్ వరకు వెళ్లింది. 'వారసుడు'కు థియేటర్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నట్లుగా తమిళ దర్శక నిర్మాత లింగుస్వామి హెచ్చరిక జారీ చేయడం మన ఇండస్ట్రీ జనాలతో పాటు సామాన్య జనాలకు కూడా మండిపోయేలా చేస్తోంది.

తమిళ అనువాద చిత్రాలతో దశాబ్దాలుగా మన ప్రేక్షకులు ఎలా నెత్తిన పెట్టుకుంటోందో.. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వాటికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మనమేదో డబ్బింగ్ సినిమాలను అడ్డుకుంటున్నట్లు, వాటికి అన్యాయం చేసేస్తున్నట్లు లింగుస్వామి మాట్లాడ్డమే విడ్డూరం. లింగుస్వామి డైరెక్ట్ చేసిన రన్, పందెంకోడి, ఆవారా లాంటి చిత్రాలను మన ప్రేక్షకులు ఎంత బాగా ఆదరించారో ఆయనకు తెలియకపోవడం విడ్డూరం. తనకు తమిళంలో అవకాశాలే లేని స్థితిలో నమ్మి సినిమా చేసింది తెలుగు హీరో అయిన రామ్.

ఈ సంగతి పక్కన పెడితే విజయ్ తమిళంలో సూపర్ స్టార్ కావచ్చు. తెలుగులో ఆయన రేంజ్ చాలా తక్కువ. పది కోట్లకు మించి ఉండదు ఇక్కడ విజయ్ మార్కెట్. అలాంటి హీరో సినిమాకు ఇక్కడి బిగ్ స్టార్ల చిత్రాలతో సమానంగా థియేటర్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం, హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరం.

గత కొన్నేళ్లలో బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి కొన్ని సినిమాలేవో తమిళంలో ఆడేశాయని.. ఇక ముందూ మన సినిమాల విషయంలో కోలీవుడ్ మీద ఆధారపడతామని లింగుస్వామి ఈ కామెంట్ చేసినట్లు కనిపిస్తోంది. కానీ మన సినిమాలు ఏవి కూడా తమిళ మార్కెట్ మీద అంతగా ఆధారపడేవి కావు. గతంలో అయినా, ఇప్పుడైనా, ఎప్పుడైనా మన మార్కెట్ మీదే తమిళ చిత్రాలు ఎక్కువ ఆధారపడతాయి. కాబట్టి వార్నింగ్ ఇచ్చే స్థితిలో ఉన్నది మన వాళ్లు. మనవాళ్లు అడ్డుకట్ట వేయడం అంటూ ఏదైనా చేస్తే తమిళ ఇండస్ట్రీ వాళ్లే గిలగిలలాడిపోవడం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News