గాడ్ ఫాదర్ తో సుకుమార్ కి సంబంధం ఏంటి..?

Update: 2022-10-14 05:50 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన ''గాడ్ ఫాదర్'' సినిమా విజయవంతంగా రెండో వారంలో అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు ఎలా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా? అనేవి పక్కన పెడితే.. ఈ సినిమాతో చిరు సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. 'ఆచార్య' వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈ విజయం బిగ్ బాస్ కు చాలా రిలీఫ్‌ ఇచ్చింది.

'గాడ్ ఫాదర్' సినిమాని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. చిరంజీవి ని సరికొత్త లుక్ లో చూపించి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది భవిష్యత్ లో చిరు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ప్రేరేపిస్తుందని చెప్పాలి. ఈ సినిమాతో ఇప్పుడు మోహన్ రాజా టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసిఫర్' సినిమా రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' తెరకెక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ మోహన్ రాజా కంటే ముందుగా అనేకమంది దర్శకుల వద్దకు వెళ్ళింది. సుజీత్ - వివి వినాయక్ ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ రీమేక్ కు ఫస్ట్ ఛాయిస్ అని చిరు స్వయంగా వెల్లడించారు.

చరణ్ ఒకరోజు 'లూసిఫర్' గురించి ప్రస్తావించాడు. చిన్న చిన్న మార్పులు చేస్తే అది తనకు పర్ఫెక్ట్‌ గా ఉంటుందని దర్శకుడు సుకుమార్ అన్నాడని చెప్పాడు. మరోసారి సినిమా చూసి కన్విన్స్ అయ్యాను. సుకుమార్ మాకు ఐడియా ఇచ్చాడు కానీ ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా తర్వాత అందుబాటులో లేకుండా పోయాడు.

కొంతమంది దర్శకులను సంప్రదించాం కానీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఆ తర్వాత మోహన్ రాజా రంగంలోకి దిగారు అని చిరంజీవి తెలిపారు. మేము చేసిన మార్పులు.. సిస్టర్ సెంటిమెంట్‌ బాగా పనిచేశాయని.. మోహన్ రాజా చాలా బాగా వర్క్ చేశారని.. పొలిటికల్ డ్రామాతో పాటు ఈ లేయర్ సినిమాకు బాగా పనిచేసిందని అన్నారు.

థమన్ నా పాత్రకు ప్రాణం పోశాడు. పాటలు, డ్యాన్సులు లేకపోయినా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. మరింత వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇది నన్ను ప్రేరేపిస్తుంది అని చిరంజీవి తెలిపారు. 'గాడ్ ఫాదర్' సక్సెస్ అనేది సమిష్టి కృషి. నేను ప్రతి ఒక్కరికీ క్రెడిట్ ఇవ్వాలి. #Mega154లో నా నుండి ఆశించే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. 'భోళా శంకర్' కోసం, మేము మంచి మార్పులు చేసాము అని చిరు వెల్లడించారు.

ఇకపోతే 'గాడ్‌ ఫాదర్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావం చూపిస్తోందంటూ టీమ్ నిన్న గురువారం మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సినిమాకు ముందుగా 'సర్వాంతర్యామి' అనే టైటిల్‌ ని అనుకున్నట్లుగా చిత్రబృందం వెల్లడించింది. అలానే ఇదే పేరుతో ఓ పాటను కూడా రూపొందించామని తెలిపారు.

అయితే మెగాస్టార్ నటించిన 'గ్యాంగ్ లీడర్' 'ఘరానా మొగుడు' వంటి చిత్రాలు 'G' అక్షరంతో ప్రారంభమై బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయని.. అందుకే ''గాడ్ ఫాదర్'' అనే టైటిల్‌ అయితే బాగుంటుందని థమన్ సూచించాడు. ఇది చిరు కు నచ్చడంతో ముందుకు వెళ్లారు.

ఆల్రెడీ 'గాడ్ ఫాదర్' టైటిల్ ను సంపత్ నంది రిజిస్టర్ చేయించుకోగా.. దర్శకుడితో మాట్లాడి టైటిల్ ను తీసుకున్నారు. 'గాడ్ ఫాదర్' అనేది హాలీవుడ్‌ లోని అత్యుత్తమ క్లాసిక్‌ లలో ఒకటనే సంగతి తెలిసిందే. అయితే తెలుగులో చిరు చిత్రానికి కూడా అదే టైటిల్ ఉండటంతో.. పారామౌంట్ కంపెనీ లీగల్ నోటీసును అందజేసిందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు.

అందుకే హిందీలో 'మెగాస్టార్ గాడ్ ఫాదర్' అని.. ఇంగ్లీష్ లో 'మెగాస్టార్ 153 #గాడ్ ఫాదర్' అని టైటిల్ చేంజ్ చేసి విదేశీ కంపెనీతో చర్చలు జరిపి విడుదలకు కొన్ని రోజుల ముందు టీమ్ క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు నిర్మాత వెల్లడించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News