ఆ బాలీవుడ్ హీరో దావూద్ ఇంటికెళ్లాడు

Update: 2017-01-16 04:26 GMT
అలనాటి బాలీవుడ్ హీరో రిషికపూర్ సంచలన విషయాల్ని చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం ఏళ్ల తరబడి వెతుకుతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన విషయాల్ని ఆయన బయటపెట్టారు. 1993 ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ను దుబాయ్ లో రహస్యంగా కలిసిన విషయాన్ని బయటపెట్టారు. కాకుంటే.. తాను దావూద్ ను కలిసే సమయానికి ముంబయి బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు.

సినిమా యాక్టర్ గా పేరు ప్రఖ్యాతుల కారణంగా గొప్పవాళ్లనే కాదు.. అనుమానాస్పద వ్యక్తులతో భేటీ అయ్యే అవకాశాన్ని కల్పిస్తాయని చెప్పిన రిషికపూర్ తన అనుభవాన్ని స్వయంగా వెల్లడించారు. ‘‘1988లో నేను దుబాయ్ వెళ్లాను. అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ బిట్టూతోకలిసి దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత ఒక తెలిసిన వ్యక్తి నన్ను కలిశారు. తన ఫోన్ లో ఒకరితో మాట్లాడాలని కోరారు. ఎవరని అడిగా. దావూద్ ఇబ్రహీం అని చెప్పారు. అప్పటికి ముంబయి బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదు’’ అని చెప్పారు.

తాను ఫోన్ మాట్లాడే సమయానికి దావూద్ ను భారత్ వెతకటం లేదని స్పష్టం చేసిన ఆయన.. మరిన్ని విషయాలు చెప్పుకొస్తూ.. ‘‘దుబాయ్ వచ్చినందుకు స్వాగతం పలికారు. ఏం అవసరం వచ్చినా తాను ఉన్నానని మరచిపోవద్దన్నారు. తన ఇంటికి రమ్మన్నారు. తర్వాత హోటల్ కు కారు పంపారు. దాంతో నేను ఆయన ఇంటికి వెళ్లాను. కారును చాలా ప్రాంతాలు తిప్పిన తర్వాత దావూద్ ఇంటికి తీసుకెళ్లారు. అందుకే.. అతని ఇంటిని గుర్తు పట్టలేకపోయా. తాను లిక్కర్ తాగనని.. అందుకే దానిని సర్వ్ చేయనని దావూద్ చెప్పారు. నాలుగు గంటలు ఆయన ఇంట్లో గడిపాను. బిస్కెట్లు.. టీ ఇచ్చారు. తనతో మాట్లాడిన సందర్భంగా తాను చిన్న చిన్న నేరాలే చేశాను కానీ ఎవరినీ చంపలేదని చెప్పారు. తర్వాత 1989లో దుబాయ్ లో దావూద్ తో మరోసారికలిశా. అప్పుడు నాతో పాటు నా భార్య నీతూ కూడా ఉంది. దావూద్ చుట్టూ పదిమంది బాడీ గార్డులు ఉన్నారు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమని ఫోన్ నెంబరు ఇచ్చారు. కానీ నేను తీసుకోలేదు. తాను యాక్టర్ నని.. తాను ఇలాంటి వ్యవహరాలకు దూరంగా ఉంటానని చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు’’ అని చెప్పారు.

తాను ఆ తర్వాత ఎప్పుడూ దావూద్ తో మాట్లాడలేదని.. పరిస్థితులు మారిపోయాయన్నారు. రిషీ కపూర్ చెప్పిన ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News