ఆవురావురమంటున్నారు.. ఆకలి తీర్చేవారెవరు?

Update: 2021-08-18 13:30 GMT
మాంచి ఆకలి మీద ఉన్నప్పుడు.. పచ్చడి మెతుకులు సైతం పంచభక్ష్య పరమాణ్ణంగా ఉంటాయి. అందుకే అంటారు ఆకలి రుచి ఎరుగదని.. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు తెలుగు ప్రేక్షకుడు. కరోనా దెబ్బకు థియేటర్లు మూసేయటం.. మొదటి వేవ్ ముగిసి.. రెండో వేవ్ కు కాస్త ముందు వరకు కొద్దికాలం సినిమాహాళ్లు తెరిచి ఉండటం.. ఆ వెంటనే మళ్లీ సెకండ్ వేవ్ విరుచుకుపడటం తెలిసిందే. ఏప్రిల్ రెండో వారంలో మొదలైన సెకంట్ వేవ్ నెలాఖరు వచ్చేసరికి థియేటర్లను పాక్షికంగా మూసేయటం.. ఆ తర్వాత పూర్తిగా మూసేయటం తెలిసిందే. కట్ చేస్తే.. ఆగస్టు మూడో వారంలోకి అడుగు పెడుతున్నా.. ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిగా తెరుచుకోని దుస్థితి.

ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో దాదాపు 80 - 90 శాతం వరకు థియేటర్లు తెరుచుకున్నాయి. సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. వారానికి అరడజను సినిమాలు విడుదల అవుతున్నా.. సినీ ప్రేక్షకుల ఆకలి తీర్చే సరైన సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవటం తెలిసిందే. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాల్లో తొలిసారి సినిమాహాళ్లు నిండిన క్రెడిట్ దక్కించుకున్నది మాత్రం విశ్వక్ సేన్ నటించిన 'పాగల్'. అది కూడా అన్ని థియేటర్లు.. అన్ని షోలు కాదు. కాకుంటే.. ఇంతకు ముందు వరకు విడుదలైన సినిమాలతో పోలిస్తే.. టికెట్లు అయిపోయాయన్న మాట థియేటర్ల బాక్సాఫీసు వద్ద ఏమైనా వినిపించిందంటే ఈ సినిమా విషయంలోనే.

మొదటి వేవ్ మొదలై రెండో వేవ్ ముగిసిన ఇప్పటి కాలం వరకు చూస్తే.. వకీల్ సాబ్ సినిమా తప్పించి.. మరే అగ్ర కథానాయుడి మూవీ విడుదల కాలేదని చెప్పాలి. పవన్ మేనియా కావొచ్చు.. ఆయన మీద అభిమానులకు ఉండే పిచ్చి అభిమానంతో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న విషయాన్ని లైట్ తీసుకొని చంటి పిల్లలతో హాళ్లకు వచ్చేసి వకీల్ సాబ్ ను చూసి సంతోషించారు. నిజానికి కరోనా ముందు వరకు సినిమా థియేటర్లలో సినిమాలు చూసే అలవాటు ఉండేది. ఓటీటీ అందుబాటులోకి వచ్చినప్పటికీ దాన్ని మొయిన్ స్ట్రీమ్ కు సరైన ప్రత్యామ్నాయంగా ప్రేక్షకులు ఫీల్ అయ్యింది లేదు.

ఓటీటీ పుణ్యమా అని.. తెలుగు.. తమిళం.. మలయాళం.. హిందీ.. ఇంగ్లిషు.. కొరియన్ తో పాటు తాము చూడాలనుకున్న ఎన్నో సినిమాల్ని సబ్ టైటిల్స్ తో చూడటం ఎక్కువైంది. దీనికి తోడు వెబ్ సిరీస్ ల జోరు పెరిగింది. గతంతో పోలిస్తే సినిమాలు చూసే ధోరణి మరింత పెరిగినా.. థియేటర్లలో వందల మందితో కలిసి చూసే ఫీల్ ను మాత్రం మిస్ అయిన పరిస్థితి. ఈ కారణంతోనే.. పెద్ద సినిమా విడుదలైతే హాల్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం పాగల్ రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర సందడి స్పష్టం చేసింది.

లాక్ డౌన్ తర్వాత ప్రముఖ రెస్టారెంట్లు ఎప్పటిలానే కళకళలాడిన వైనాన్ని గుర్తు చేసుకుంటే.. ఎవరైనా బడా నిర్మాత తన సినిమాను థియేటర్లలో విడుదల చేయాలే కానీ కలెక్షన్ల వర్షం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఆకలితో ఆవురావురమన్న పరిస్థితికి తెలుగు ప్రేక్షకుడి పరిస్థితి దగ్గరగా ఉందని.. ఇలాంటి వేళలో సరైన సినిమా రావాలే కానీ.. దుమ్ము రేపుతుందంటున్నారు. మరి.. ఆ ఛాన్సును చేజిక్కించుకునే సినిమా ఏదో చూడాలి మరి.
Tags:    

Similar News