#గుస‌గుస‌.. ఆదిపురుష్ అలా.. స‌లార్ ఇలా..!

Update: 2022-06-02 04:45 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డిలో న‌టిస్తున్న ప్ర‌భాస్ మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు 2022-23 సీజ‌న్ లో క్రేజీ సినిమాలుగా విడుద‌ల‌వుతున్నాయి. అయితే ఇంత‌లోనే ఇరు చిత్రాల మేక‌ర్స్ హాట్‌ కామెంట్స్ అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మిస్తున్న భూషణ్ కుమార్ ఒక విచిత్రమైన వ్యాఖ్య చేసారు. 500 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్‌ సినిమా రూపొందుతోంది. కాబట్టి మేము బ్లాక్ బస్టర్ ధ‌ర‌ల‌తో ముందుకెళ‌తామ‌ని వ్యాఖ్యానించారు. అంటే టికెట్ ధ‌ర‌ల విష‌యంలో పెంచిన ధరతో ముందుకు వెళ్లతామ‌నేది ఆయ‌న ఉద్ధేశం.

ప‌రిమిత సీటింగ్ తో న‌డిచే థియేట‌ర్ల‌లోకి ప్ర‌భాస్ క్రేజుతో ధ‌ర ను ప‌ట్టించుకోకుండా జ‌నం వ‌స్తారనేది ఆయ‌న ధీమా. కానీ అన్నిసంద‌ర్భాల్లోనూ అలా జ‌రుగుతుందా? అంటే చెప్ప‌లేం. బాహుబ‌లి- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 కి ఉన్న‌ది ఆదిపురుష్ కి ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. 83- జెర్సీ లాంటి భారీ పెట్టుబ‌డుల చిత్రాలు డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డానికి కార‌ణం అందుబాటులో లేని టికెట్ ధ‌ర‌లు ఒక కార‌ణ‌మ‌ని కూడా విశ్లేషించారు.

అలాగే ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో చిత్రం 'సలార్' గురించి నిర్మాత విజయ్ కిరగందూర్ ఏమ‌న్నారు? అంటే.. స‌లార్ తెర‌పై అద్బుతంగా ఉండాలని కోరుకుంటున్న‌ట్టు నిర్మాత విజయ్‌ కిరగందూర్ అన్నారు. KGF 2 విజయంతో ఎక్కువ ధీమాగా ఉన్న ఆయ‌న ప్రభాస్ స‌లార్ ని బ్లాక్ బస్టర్ చేయడానికి ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకునేందుకు సిద్ధంగా లేడు.

ఈ సినిమా 35 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని నిర్మాత‌ తెలియజేసారు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రతి నెలా పక్షం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది కాకుండా ప్రతి నెలా వారం రోజులు ఆయన హాజరు అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం భారీ బ‌డ్జెట్ల‌ను వెచ్చిస్తున్నారు.

స‌లార్ లో యాక్షన్‌ అత్యద్భుతంగా ఉంటుందని విజయ్‌ కిరగందూర్‌ హామీ ఇచ్చారు. యాక్షన్ అవతార్ లో ప్రభాస్ ని చూడటం అతని అభిమానులకు ట్రీట్ అవుతుంది. అభిమానులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆయన తెలిపారు. అయితే స‌లార్ కి టికెట్ ధ‌ర‌ల గురించి బ్లాక్ బ‌స్ట‌ర్ ధ‌ర‌ల గురించి ఆయ‌న మాట్లాడ‌లేదు.. కానీ ప్ర‌భాస్ క్రేజ్ తో టికెట్ ధ‌ర‌ల‌ను పెంచే యోచ‌న చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను థియేట‌ర్ల‌కు ప‌దే ప‌దే ర‌ప్పింగ‌లిగితే రికార్డ్ హిట్టు సాధ్య‌మేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు.
Tags:    

Similar News