పవన్ పుట్టినరోజు స్పెషల్.. ‘పవర్ స్టార్’ బిరుదు వెనుక ఉన్నదెవరు?

Update: 2021-09-02 04:32 GMT
అభిమానానికి హద్దులు ఉంటాయి అంటే.. వెర్రిగా ఒక నవ్వు నవ్వేస్తారు. అలా నవ్వే వారిలో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు.తమ అభిమాన హీరోల్ని అభిమానించటం.. ప్రేమించటం.. ఆరాధించటం లాంటి పదాలకు మించిన బంధం పవన్ కు ఆయన ఫ్యాన్స్ కు మధ్య కనిపిస్తుంది. పవన్ జీవనశైలిని పవనిజం అంటూ నినదించటమే కాదు.. ఆ దిశగా అడుగులు వేయాలంటూ చెప్పే వారు చాలామంది కనిపిస్తారు.

నిజానికి పవన్ కల్యాణ్ కు సినిమాల పరంగా వచ్చిన ఇమేజ్ కంటే కూడా.. నిజజీవితంలో ఆయన వ్యవహరశైలి.. ప్రదర్శించే కరుణ.. జాలి.. దాన గుణం ఆయన్ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. అభిమాన కథానాయకులకు అభిమానులు కొత్తేం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు చూస్తే.. పిచ్చిగా.. వెర్రిగా.. ఏం చెప్పినా సరే మారని ఫ్యాన్ బేస్ మొట్టమొదట సూపర్ స్టార్ క్రిష్ణకు సొంతమని చెప్పాలి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కేనని చెప్పాలి.

తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నా.. ఈ ఇద్దరు కథనాయకులకు ఉండే అభిమానులు కాస్త భిన్నమని చెప్పక తప్పుదు. పవన్ ను తమ అభిమాన హీరో అనే కన్నా.. తమ దేవుడిగా కీర్తించేవారు బోలెడంత మంది కనిపిస్తారు. ఈ రోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయం గురించి మాట్లాడుకోవటం బాగుంటుంది. పవన్ కల్యాణ్ పేరు ముందుపవర్ స్టార్ అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది కదా? మరి.. ఆ బిరుదు ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎవరి కారణంగా వచ్చింది? అన్న ప్రశ్నలకు చాలామంది పవన్ అభిమానులకు తెలిసి ఉండదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు చెప్పేది.

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా పవన్ కల్యాణ్ సినీ ప్రస్థానం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’తో మొదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించిన ఈ మూవీని ఇవీవీ డైరెక్టు చేశారు. ఈ సినిమా యావరేజ్ గా మాత్రమే నిలిచింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ మూవీ చేశారు. తమిళంలో హిట్ అయిన ‘గోకులతై సీతై’కు ఇది రీమేక్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటల్ని అందించారు.

ఈ మూవీ రిలీజ్ టైంలో విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్ ను మొదటిసారిగా పవర్ స్టార్ గా సంబోధించారు. ఆ తర్వాత నుంచి పత్రికలు.. ఆ తర్వాత అభిమానులు పవర్ స్టార్ అంటూ పిలవటం షురూ చేశాయి. చివరకు పవన్ కల్యాణ్ అనే దాని కంటే కూడా ‘పవర్ స్టార్’ అనే మాటే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా పోసానికే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక.. సినిమాల్లో పవన్ కల్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదును టైటిల్ కార్డులో వేసింది మాత్రం మరో బ్లాక్ బస్టర్ మూవీ అయిన.. ‘సుస్వాగతం’లో. ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుడు సార్థక నామధేయంగా మారిపోయింది. అదీ.. పవర్ స్టార్ బిరుదు వెనుకున్న రియల్ స్టోరీ.
Tags:    

Similar News