విశ్వక్ సేన్ వర్క్ చేయడానికి ఇష్టపడని డైరెక్టర్ ఎవరు..?

Update: 2022-10-17 16:01 GMT
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో కంటే తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు మాస్ కా దాస్.

ఏదైనా విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్తూ ఉంటాడు విశ్వక్ సేన్. నన్ను ఎవడూ లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేను లేపుకోగలను అని స్టేట్మెంట్స్ ఇవ్వగలడు. తను చెప్పింది జరగకపోతే తన పేరునే మార్చేసుకుంటా అని చెప్పగలిగే హీరో ఒక్క విశ్వక్ అనే చెప్పాలి.

అలాంటి విశ్వక్ సేన్ కు ఇప్పుడు టాలీవుడ్ లో పనిచేయడానికి ఇష్టపడని డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. సాధారణంగా ఏ ఇంటర్వ్యూలో అయినా.. ఏ దర్శకుడితో వర్క్ చేయడానికి ఇష్టపడతారు? అని హోస్ట్స్ అడుగుతుంటారు. హీరోలు సైతం తాము పని చేయాలనుకుంటున్న దర్శకుడు ఎవరని చెప్తుంటారు.

కానీ అక్కడ హోస్ట్ గా ఉంది నటసింహం నందమూరి బాలకృష్ణ. మాస్ గాడ్ అలాంటి ప్రశ్న అడిగినప్పుడు.. మాస్ కా దాస్ కూడా ఈ ప్రశ్నను దాటవేయకుండా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ దర్శకుడితో పని చేయకూడదని అనుకుంటున్నాడో సమాధానం ఇచ్చి సంచలనం సృష్టించాడని తెలుస్తోంది.

బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో రెండో సీజన్ ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో ఎపిసోడ్ లో 'పాగల్' విశ్వక్ సేన్ మరియు 'డీజే టిల్లు' సిద్ధు జొన్నలగడ్డ కలిసి సందడి చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో దబిడి దబిడే అంటూ బాలకృష్ణ అడిగే ప్రశ్నలకు.. యువ హీరోలు ఫన్నీ సమాధానాలు చెప్పినట్లు ప్రోమోని బట్టి తెలుస్తోంది. మ్యాన్సన్ హౌస్ దగ్గర నుంచి అమ్మాయిలను దువ్వడం వరకూ అన్ని విషయాలపై సరదా సంభాషణ సాగించినట్లు అర్థమైంది. ఇద్దరి మధ్య స్నేహం గురించి.. సినిమాలు మరియు ఇతర విషయాలపై సిద్ధు - విశ్వక్ అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే ఈ షోలో అడిగిన ప్రశ్న గురించి విశ్వక్ బయటపెట్టేసాడు.

విశ్వక్ సేన్ నటించిన "ఓరి.. దేవుడా..!" సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. అదే రోజున ఆహా ఓటీటీలో 'అన్‌ స్టాపబుల్ 2' ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టాక్ షోలో టాలీవుడ్‌ లో తాను పనిచేయడానికి ఇష్టపడని దర్శకుడి గురించి విశ్వక్ ను బాలకృష్ణ అడిగారట.

విశ్వక్ సేన్ ఈ ప్రశ్నను దాటవేయడానికి బదులుగా, ప్రస్తుతం ఏ దర్శకుడితో పని చేయకూడదని అనుకుంటున్నాడో సమాధానం ఇచ్చాడట. అందరూ వర్క్ చేయాలని అనుకునే డైరెక్టర్ ఎవరో చెప్తారు కానీ.. ఫలానా ఫిల్మ్ మేకర్‌ తో పని చేయకూడదని అనుకుంటున్నానని చెప్పడం చాలా అరుదుగా చూస్తుంటాం.

కానీ 'అన్‌ స్టాపబుల్ 2' వేదికగా విశ్వక్ ఇలాంటి ప్రశ్నకు బదులిచ్చారట. ఫైనల్ ఎడిట్‌లో ఆ ప్రశ్న మరియు సమాధానం ఉంటుందా లేదా అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఉంటే మాత్రం సంచలనం సృష్టించడమే కాదు.. ఓ వర్గం ఫ్యాన్స్ ని హర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏం జరుగుతుందో త్వరలోనే తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News