సెలబ్రెటీలు మోశారు.. ప్రేక్షకులు పడేశారు

Update: 2019-07-16 14:30 GMT
మంచి సినిమాగా పేరొచ్చినంత మాత్రాన వసూళ్లు వస్తాయనేమీ లేదు. చరిత్రలో ఇందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఇప్పుడు ‘దొరసాని’ ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్‌ గా నిలుస్తోంది. ఈ సినిమాను సెలబ్రెటీలు తెగ మోసేశారు. విడుదలకు ముందు ప్రివ్యూ చూసిన వాళ్లంతా దీన్నొక దృశ్య కావ్యంగా పేర్కొన్నారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సహా పలువురు దర్శకులు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. రిలీజ్ తర్వాత కూడా సెలబ్రెటీల ప్రశంసలు కొనసాగుతున్నాయి. కానీ ఈ సినిమాకు ప్రేక్షకాదరణ మాత్రం దక్కట్లేదు. రిలీజ్ రోజే చాలా తక్కువ ఆక్యుపెన్సీ కనిపించింది. రివ్యూలు, మౌత్ టాక్ ఏమంత బాగా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది. వీకెండ్‌లోనే 30 శాతం ఆక్యుపెన్సీ కష్టమైంది.

ఇక సోమవారం నుంచి పరిస్థితి దారుణం. థియేటర్ల రెంట్లకు తగ్గ కలెక్షన్లు కూడా రావట్లేదు. సినిమా ఆడకపోవడానికి పరోక్షంగా క్రిటిక్సే కారణమన్నట్లుగా మాట్లాడాడు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. కానీ 30 ఏళ్ల కిందటి తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని.. అప్పటి మనుషుల్ని.. భాషను.. యాసను.. చాలా సహజంగా చూపించినంత మాత్రాన.. కథలో ఏ కొత్తదనం లేకుండా.. మరీ స్లో నరేషన్‌ తో రొటీన్ ప్రేమకథను చెబితే జనాలకు ఎలా నచ్చుతుంది. దర్శకుడి పొయెటిక్ నరేషన్.. ఆర్ట్ సినిమాలు రుచించే వాళ్లకు మాత్రమే నచ్చింది. సగటు ప్రేక్షకుడిని ఎగ్జైట్ చేసే అంశాలు సినిమాలో పెద్దగా లేకపోయాయి. లీడ్ యాక్టర్స్ అయినా ప్రేక్షకులకు కనెక్టయ్యేలా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇద్దరి మీదా జనాల్లో ముందే నెగెటివిటీ ఉంది. వాళ్లు బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ ఫేస్ వాల్యూ లేకపోవడం మైనస్ అయింది. మొత్తానికి సినిమాకు ప్రేక్షకుల నుంచి తిరస్కారమే ఎదురైంది. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా అయితే ఇది డిజాస్టర్ అనే చెప్పాలి.

Tags:    

Similar News