ఉస్తాద్ రామ్ డైరెక్ట‌ర్ కు సారీ ఎందుకు చెప్పాడు?

Update: 2022-06-23 09:30 GMT
ఎన‌ర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ 'ఇస్మార్ట్ శంక‌ర్‌' మూవీతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చారు. ఈ సినిమా ఆయ‌న‌కు మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్ట‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని అందించి రామ్ కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్ ల‌ని సొంతం చేసుకున్న మూవీగా రికార్డు సాధించింది. ఈ మూవీతో త‌న మాస్ ప‌ల్స్ ని తెలుసుకున్నా రామ్ అంత‌కు మించిన హైవోల్టేజ్ మూవీని ఫ్యాన్స్ కి అందించాల‌ని మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్నారు. 'ది వారియ‌ర్‌' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి తెర‌కెక్కిస్తున్నారు.

రామ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్న ఈ మూవీపై రామ్ తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ కూడా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. 'ఉప్పెన‌'తో బేబ‌మ్మ‌గా మంచి పేరు తెచ్చుకున్న క్రేజీ లేడీ కృతిశెట్టి ఇందులో రామ్ కు జోడీగా న‌టిస్తోంది. ఆది పినిశెట్టి విల‌న్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో బై లింగ్వ‌ల్ గా రూపొందిస్తున్నారు. రామ్ కెరీర్ లోనే భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని జూలై 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ నేప‌థ్యంలో హీరో రామ్ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామికి సోస‌ల్ మీడియా వేదిక‌గా క్ష‌మాప‌ణ‌ల చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే... రామ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది వారియ‌ర్‌' రిలీజ్ కు రెడీ అవుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే టీజ‌ర్ తో పాటు 'బుల్లెట్ బండి'.., 'ద‌డ ద‌డ మంటూ గుండెల శ‌బ్దం..' అంటూ సాగే లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేసింది. ఇందులో 'బుల్లెట్ బండి' సాంగ్ నెట్టింట రికార్డు స్థాయి వ్యూస్ తో మిలియన్ల కొద్ది వ్యూస్ ని సొంతం చేసుకుంటూ రికార్డు దిశ‌గా దూసుకుపోతోంది.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మ‌రో లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.  రామ్‌చ కృతిక‌ల‌పై చిత్రీక‌రించిన 'విజిల్' అంటూ సాగే మాస్ బీట్ కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. హైద‌రాబాద్ లో ని ఏఎంబీ సినిమాస్ లో జ‌రిగిన ఈ ఈవెంట్‌లో హీరో రామ్‌, కృతిశెట్టి, ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగు స్వామి, నిర్మాత శ్రీ‌నివాస చిట్టూరి, కెమెరామెన్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ పాల్గొన్నారు. విజ‌ల్ పాట త‌న‌కెంత‌గానో న‌చ్చింద‌ని, ఈ పాట చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా జ‌రిగిన కొన్ని మ‌ధుర జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్నారు. హీరోయిన్ కృతి క‌ష్ట‌మైనా స‌రే ఈ పాట‌ని ఇష్టంగా చేసింద‌ని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ గురించి మాట్లాడారు.. కెమెరామెన్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గురించి మాట్లాడిన హీరో రామ్ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా ఆయ‌న గురించి మ‌ర్చిపోయారు.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఈవెంట్ త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగు స్వామికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ సినిమా తెర‌కెక్క‌డంలో ముఖ్య పాత్ర పోషించి మొత్తం త‌న భుజాల‌పైనే వేసుకున్న‌ వ్య‌క్తి గురించి చెప్ప‌డం మ‌ర్చిపోయాను. నా వారియ‌ర్ డైరెక్ట‌ర్ లింగుస్వామి. ఈ సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్ ని మీరు మీ భుజాల‌పైకి ఎత్తుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను ప‌నిచేసిన ఉత్త‌మ‌మైన ద‌ర్శ‌కుల్లో మీరూ ఒక‌రిగా ఉన్నందుకు ద‌న్య‌వాదాలు.. సారీ అండ్ ల‌వ్ యూ' అని ట్విట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  

గ‌తంలో ఇదే త‌ర‌హాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు దిగ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కు క్ష‌మాప‌ణ చెప్పారు. ఆయ‌న‌తో 'స్నేహితుడు' సినిమా చేయాల్సింది కానీ కుద‌ర‌క చేయ‌లేక‌పోయారు. ఆ కార‌ణంగా ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు మ‌హేష్‌. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కు హీరో రామ్ చ‌ర‌ణ్ సారీ చెప్పిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతే కాకుండా ఇటీవ‌ల దర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ హీరోయిన్ మీనాక్షీ దీక్షిత్ కు సారీ చెప్ప‌డం తెలిసిందే. 'ఖిలాడీ' మూవీ ట్రైల‌ర్ లో త‌న పాత్ర‌ని త‌గ్గించి డింపుల్ హ‌యాతీకి అధిక‌ ప్రాధాన్య‌త‌ను ఇచ్చాడు. ఈ విష‌యం పై హీరోయిన్ మీనాక్షీ దీక్షిత్ కు క్లారిటీ ఇస్తూ స్టేజ్ పైనే త‌న‌కి సారీ చెప్ప‌డం విశేషం. ఇలా స్టార్స్‌, స్టార్ డైరెక్ట‌ర్స్ ఓవ‌ర్ లుక్ లో మ‌ర్చి పోవ‌డం వ‌ల్ల సారీలు చెప్పి వార్త‌ల్లో నిలిచారు. తాజా హీరో రామ్ కూడా ఇదే త‌ర‌హాలో సారీ చెప్పి వార్త‌ల్లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News