స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎందుకు వెన‌క్కి త‌గ్గారు?

Update: 2022-07-20 03:30 GMT
సినిమా షూటింగ్ లు, పెరిగిన నిర్మాణ వ్య‌యం, ఆర్టిస్ట్ ల రెమ్యున‌రేష‌న్ లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల కార‌వాన్ ఖ‌ర్చులు, గంట‌ల లెక్కన పారితోషికాలు, 24 క్రాఫ్ట్‌ల వ‌ల్ల వున్న స‌మ‌స్య‌లు పై ఏకాభిప్రాయానికి రావ‌డం. వంటి విష‌యాల‌పై ఇటీవ‌ల ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్ర‌ధానంగా చ‌ర్చించింది.

అంతే కాకుండా టైర్ 2 హీరోల పారితోషికాలు, వారి అసిస్టెంట్ ల ఖ‌ర్చులు, స్టాఫ్ ఖ‌ర్చులు, ఫెడ‌రేష‌న్ ఇటీవ‌ల మెరుపు స‌మ్మెకు పిలుపు నివ్వ‌డం వంటివి చ‌ర్చించి ఇక‌పై ఇలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా త‌గు విధంగా సినిమాల నిర్మాణం జ‌ర‌పాల‌ని, అలా కాని ప‌క్షంలో కొత్త చిత్రాల షూటింగ్ ల‌ని వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.  

ద‌స‌ప‌ల్లా హోట‌ల్ లో ప్ర‌త్యేకంగా గిల్డ్ ప్రొడ్యూస‌ర్స్ స‌మావేశ‌మై ఈ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌న్న‌ది తెలిసిందే. అనుకున్న‌వ‌న్నీ సెట్ కాక‌పోతే ఆగ‌స్టు 1 నుంచి కొత్త సినిమాల షూటింగ్ ల‌ని ఆపేయాల‌న్న నిర్ణ‌యాన్ని కూడా తీసుకున్నార‌ట. దీనిపై గిల్డ్ లో వున్న ప్రొడ్యూస‌ర్స్ అంతా ఓకే చెప్పిన‌ట్టుగా తెలిసింది. అయితే ఈ విష‌యంలో ముందు నుంచి గ‌ట్టిగా వాదిస్తున్న దిల్ రాజు మాత్రం కాస్త వెన‌క్కి త‌గ్గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ `థాంక్యూ`. నాగ‌చైత‌న్య హీరోగా న‌టించ‌గా విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన దిల్ రాజు కొత్త ప‌ల్ల‌వి వినిపించారు. రెమ్యున‌రేష‌న్ లు, బ‌డ్జెట్ లపై చ‌ర్చించ‌లేద‌ని, కేవ‌లం కంటెంట్‌, ఓటీటీ, టికెట్ రేట్ల‌పై మాత్ర‌మే చ‌ర్చించామ‌ని షూటింగ్ ల బంద్ పై ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఇలా వున్న‌ట్టుండి దిల్ రాజు మాట మార్చడానికి గ‌ల‌ కార‌ణం ఏంట‌న్న‌ది అనుమానాలు రేకెత్తిస్తోంది.

ప్ర‌స్తుతం షూటింగ్ లు బంద్ చేయాల‌నే వాద‌న‌ని కొంత మంది నిర్మాత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. కార‌ణం వారు నిర్మిస్తున్న సినిమాలు చివ‌రి ద‌శ‌లో వుండ‌ట‌మే. అంతే కాకుండా స్టార్ హీరోలు త‌న‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌మాదం వుంది కాబ‌ట్టే దిల్ రాజు ఉన్న‌ట్టుండి మాట మారుస్తున్నార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News