వంశీ పైడిపల్లి కి అంత గ్యాప్ ఎందుకు వస్తుందంటే..?

Update: 2021-11-01 07:32 GMT
2007 లో 'మున్నా' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన వంశీ పైడిపల్లి.. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా గ్యాప్ తీసుకుంటూ 14 ఏళ్ళ కెరీర్ లో కేవలం ఐదు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేయగలిగారు. రెండో సినిమా 'బృందావనం' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నాలుగేళ్ళ సమయం తీసుకున్న వంశీ.. 'ఎవడు' చిత్రానికి నాలుగేళ్లు.. 'ఊపిరి' కోసం రెండేళ్లు.. 'మహర్షి' కోసం మరో మూడేళ్లు టైం తీసుకున్నారు. 2019 నుంచి కొత్త స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు కానీ.. ఇది ఆడియన్స్ ముందుకు రావడానికి ఇంకొంత కాలం పట్టే అవకాశం ఉంది.

అయితే సక్సెస్ ని క్యాష్ చేసుకోకుండా.. సినిమా సినిమాకి ఇంత గ్యాప్ తీసుకుడానికి గల కారణాలను దర్శకుడు వంశీ పైడిపల్లి వివరించారు. 'మహర్షి' సినిమా ద్వారా నేషనల్ అవార్డ్ అందుకున్న సందర్భంగా వంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడుని అయ్యాను. ముందుగా నేను డైరెక్టర్ ని.. ఆ తర్వాతే రైటర్ ని. నాకు ఏదైనా ఐడియా వస్తే అంత ఈజీగా డెవలప్ చేయలేను. ఆలోచన నాదైనా కానీ కొంతమంది రచయితలతో కూర్చోని చర్చించాలి. నా ఆలోచన వాళ్లకు చెబితే.. వాళ్లు నాకేదో చెబుతారు. ఇదంతా ఒక ప్రాసెస్. నా మనసుకు నచ్చే వరకు ఎన్నో మార్పులు జరుగుతాయి. త్వరగా టక్ టక్ మని నేను వర్క్ చేయలేను''

నేను ఇంకో ఐదు సినిమాలు చేస్తానో నాలుగు చేస్తానో నాకు తెలియదు. కానీ ప్రతి సినిమా నిలిచిపోవాలని కోరుకుంటాను. మంచి సినిమాలు తీయడానికే నేను టైం తీసుకుంటా. ఇక్కడ మనకు మనమే కాంపిటీషన్. ఇప్పుడు చేసే సినిమా నా గత సినిమా కంటే బెటర్ గా ఉండాలని అనుకుంటా. దీని కోసం నేను ఎంతో స్ట్రెస్ ని ప్రెజర్ ని తీసుకుంటాను. అంతా ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్తా. దాని వల్లే నేను ఎక్కువ టైం తీసుకుంటున్నా. ఒకసారి పూరీ జగన్నాధ్ ని కథ రాయడానికి ఎంత టైం పడుతుందని అడిగితే 15 రోజులు అని అన్నారు. ఆయనకు రెండు చేతులెత్తి దండం పెడతాను. అలా నా వల్ల కాదు. అయినా ఒకరి క్రియేటివిటీని మరొకరికి కంపేర్ చేయలేము. నా సినిమాల విషయంలో హ్యాపీగా ఉన్నాను'' అని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.

'ఊపిరి' 'మహర్షి' సినిమాలకు సోలమన్ ('వైల్డ్ డాగ్' దర్శకుడు) మంచి ఇన్ పుట్స్ ఇచ్చాడని వంశీ పైడిపల్లి తెలిపారు. ప్రస్తుతం మనసా వాచా కర్మనా థలపతి విజయ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నానని.. ఇది తన కెరీర్ లో మరో బిగ్ ఫిల్మ్ అని.. thalapathy66 అయిన తర్వాతే తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారని అన్నారు. ఈ సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ యువ హీరోతో ఉండే అవకాశం ఉందని వంశీ పైడిపల్లి హింట్ ఇచ్చారు.


Tags:    

Similar News