రణబీర్ తండ్రిగా రణవీర్ నటిస్తాడా..?

Update: 2022-09-14 05:30 GMT
బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "బ్రహ్మాస్త్రం" సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. విమర్శకుల రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు.

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ ను పూర్తి చేసుకున్న 'బ్రహ్మాస్త్రం'.. సోమవారం టెస్ట్ లో ఫెయిల్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది. దాదాపు 50 శాతం పడిపోయిందని తెలుస్తోంది. మంగళవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమంత గొప్పగా లేవు.

'బ్రహ్మాస్త్ర' చుట్టూ నెలకొన్న హైప్ దృష్ట్యా దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల సంగతేమో కానీ.. హిందీలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. దీనికి తోడు రిలీజ్ తర్వాత మేకర్స్ ఏమాత్రం ప్రమోషన్స్ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లాంగ్ రన్ లో ఎంత వరకూ వసూలు చేస్తుందో చూడాలి.

ఇకపోతే 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ ముందే ప్రకటించారు. ఇప్పుడు 'బ్రహ్మాస్త్రం: శివ' పేరుతో పార్ట్-1 ని రిలీజ్ చేశారు. ఇందులో అగ్ని అస్త్ర శివ గా రణబీర్ కపూర్ కనిపించాడు. అలియా భట్ హీరోయిన్ గా నటించగా.. అక్కినేని నాగార్జున - అమితాబ్ బచ్చన్ - షారుక్ ఖాన్ - మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు.

'బ్రహ్మాస్త్ర' మొదటి భాగం కాదంతా శివ పాత్ర చుట్టూ తిరుగుతుంది. రెండో భాగాన్ని "బ్రహ్మాస్త్రం: దేవ్" పేరుతో తెరకెక్కించనున్నట్లు హింట్ ఇచ్చారు. దీంతో పార్ట్-1 చూసిన వాళ్లంద‌రికీ రెండో భాగం మీద ఆస‌క్తి నెల‌కొంది. ఇందులో హీరోగా ఎవరు కనిపిస్తారని ఆలోచిస్తున్నారు.

దేవ్ అనేది సినిమాలో ర‌ణ‌బీర్ కపూర్ తండ్రి పాత్ర పేరు. గ్రాఫిక్స్ రూపంలో ఒక చిత్ర‌మైన ఆకారంలో ఆ పాత్రను చూపించారు. ఎవరనేది రివీల్ చేయలేదు. సెకండ్ పార్ట్ కథ మొత్తం అత‌డి పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. ఒక రకంగా ఇది 'బ్రహ్మాస్త్ర' పార్ట్-1 కు ప్రీక్వెల్ అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ తల్లిదండ్రులుగా ఎవరు కనిపిస్తారనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తారని తెలుస్తోంది. అలానే అతనికి జోడీగా శివ తల్లిగా అమృత పాత్రలో దీపికా పదుకునే కనిపించనుంది.

అయితే నిర్మాత కరణ్ జోహార్ ఈ 'బ్రహ్మాస్త్ర 2' లో దేవ్ పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హృతిక్ రోషన్ ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. ఎక్కువ శాతం రణ్వీర్ సింగ్ నే తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరూ కుదరకపోతే రణబీర్ కపూరే తండ్రి పాత్ర చేసినా చేయొచ్చని అంటున్నారు. మరి అయాన్ ముఖర్జీ అండ్ టీమ్ ఎలా ఆలోచిస్తారో చూడాలి.

'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ - స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని నాలుగు దక్షిణాది బాషల్లో సమర్పించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News