రష్మిక ని బ్యాన్ చేస్తారా..?

Update: 2022-11-25 08:33 GMT
'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో చలోమంటో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నటిస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉంది. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. అది చివరకు అమ్మడిని బ్యాన్ చేసే వరకూ వెళ్తోందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

గత కొన్ని రోజులుగా రష్మిక మందన్న పై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో పుట్టి పెరిగి.. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌజ్ పేరును చెప్పడానికి కూడా ఆమె ఇష్టపడటం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

రష్మిక మందన్న 'కిర్రిక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఇది వాళ్ళ సొంత ప్రొడక్షన్ లో రూపొందింది. అయితే ఇటీవల రష్మీక ఓ ఇంటర్వ్యూలో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరును చెప్పలేదు.

ఫస్ట్ సినిమా ఆఫర్ గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువుతున్న రోజుల్లో తాను మోడలింగ్ చేశానని.. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీలో తన ఫోటో ప్రచురితమైందని చెప్పిందని.. అది చూసి సోకాల్డ్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన కాల్ వచ్చిందని రష్మీక చెప్పింది. నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సోకాల్డ్ అంటూ పేర్కొనడమే వివాదానికి కారణమైంది.

రష్మిక మందన్నకు కృతజ్ఞత లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టికి చెందిన బ్యానర్ కావడంతోనే ఆమె ప్రొడక్షన్ హౌజ్ పేరు చెప్పలేదని మరికొందరు ఆరోపించారు. దీనికి తోడు కన్నడ సినిమా స్థాయిని పెంచిన 'కాంతారా' చిత్రాన్ని తాను చూడలేదని రష్మిక చెప్పడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది.

కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కాంతరా సినిమా చూడటానికి టైం లేదని చెప్పి రష్మీక యాటిట్యూడ్ చూపించిందని నెటిజన్లు విమర్శించారు. కర్ణాటకకు చెందిన అమ్మాయి అయ్యిండి, కన్నడ సినిమాని అవమానపరుస్తుందంటూ కన్నడిగులు ఆమె పై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక ని నిషేధించనుందని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కన్నడ థియేటర్ యజమానులు మరియు నిర్మాణ సంస్థలు త్వరలో రష్మికపై చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. కర్ణాటకలో ఆమె చిత్రాలను నిషేధించే స్థాయికి కూడా వెళ్ళవచ్చని అంటున్నారు. అమెరికాలో ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డు మెంబర్, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేస్తూ.. కన్నడ సినీ పరిశ్రమకి రష్మిక గౌరవం ఇవ్వట్లేదని.. తమ సినీ పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడుతుందని రష్మికని బ్యాన్ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

రష్మిక మందన్నను నిషేధించడం గురించి అధికారిక నివేదికలు లేవు కాబట్టి.. ఇవన్నీ ఫేక్ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి నేషనల్ క్రష్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే రష్మికని కన్నడలో బ్యాన్ చేస్తారా? దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News