వీన‌స్- సెరెనా విలియ‌మ్స్ బ‌యోపిక్‌

Update: 2019-03-06 17:30 GMT
వ‌ర‌ల్డ్ టెన్నిస్ లో చాంపియ‌న్లుగా త‌మ‌దైన ముద్ర వేసిన సిస్ట‌ర్స్‌ సెరీనా విలియమ్స్‌, వీనస్‌ విలియమ్స్‌. బ‌యోపిక్ ల ట్రెండ్ లో ప్ర‌స్తుతం ఈ సిస్ట‌ర్స్ పైనా ఓ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో ఈ స్టార్ క్రీడాకారిణుల‌ను తీర్చిదిద్దిన డాడ్ పాత్ర‌కే అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. డాడ్ వివియ‌న్ రిచ‌ర్డ్ కోణంలో క‌థ‌ను చెబుతార‌ట‌. ఆ పాత్ర‌కు ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ ని ఎంపిక చేశారు. స్మిత్ ప్ర‌స్తుతం అల్లాడిన్ (అల్లా ఉద్దీన్) లాంటి భారీ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. అటుపై పూర్తిగా ఈ బ‌యోపిక్ పై దృష్టి సారిస్తాడ‌ట‌. ఇంకా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఫైన‌ల్ చేయాల్సి ఉంది.

స‌మ‌కాలీన ప్ర‌పంచంలో టెన్నిస్ కి ఉన్న ప్రాధాన్య‌త తెలిసిందే. టెన్నిస్ స్టార్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీర‌భిమానులు ఉంటారు. 1999 యూఎస్‌ ఓపెన్‌లో దుమారం రేపిన‌ సెరీనా ఇప్పటివరకూ 23 గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. వీనస్‌తో కలిసి ఆడి 14 గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ ఛాంపియన్‌ షిప్‌లను సొంతం చేసుకోవ‌డం ఓ సంచ‌ల‌నం. అందుకే హాలీవుడ్ లో ఈ బ‌యోపిక్ ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. స్క్రిప్టు రెడీ. న‌టీన‌టుల్ని ఎంపిక చేయాల్సి ఉంది.

సెరీనా, వీనస్‌లకు 4 వయసున్నప్ప‌టి నుంచి అత్యుత్తమ టెన్నిస్‌ క్రీడాకారిణులుగా తీర్చిదిద్దాలని తండ్రి రిచర్డ్‌ భావించారు. అందుకోసం 78 పేజీలతో ఒక ప్రణాళికను సిద్ధం చేసి దానిని అమ‌ల్లో పెట్టారు. టెన్నిస్‌కు సంబంధించిన ఒక్కో పాఠాన్ని వారికి చెబుతూ ప్రొఫెషనల్‌ క్రీడాకారిణులుగా తీర్చిదిద్దారు. అందుకోసం రేయింబ‌వ‌ళ్లు ఎంత‌గానో శ్ర‌మించారు. ఈ మొత్తాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తార‌ట‌. ప్రఖ్యాత‌ జాచ్‌ బేలిన్‌ రాసిన ‘కింగ్‌ రిచర్డ్‌’  స్క్రిప్ట్‌ 2018 బ్లాక్‌లిస్ట్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. దానినే సినిమా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్‌ త్రోవర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై టిమ్‌, ట్రీవర్‌లు నిర్మించనున్నారు. విల్‌స్మిత్‌ నిర్మాణ భాగస్వామి. విల్ స్మిత్ ఇలాంటి చిత్రంలో న‌టించ‌డం అన్న‌ది బాక్సాఫీస్ కి క‌లిసొచ్చేదే. ఇక ఇటీవ‌లే ఆయ‌న భార‌త‌దేశం విచ్చేయ‌డ‌మే గాక ఇక్క‌డ ప్ర‌యాగ మ‌హాకుంభ‌మేళాలో శివునికి పూజ‌లు చేసి అంద‌రికీ షాకిచ్చిన సంగ‌తి విదిత‌మే.

Tags:    

Similar News