తరుణ్ భాస్కర్ ఐడియా థియేటర్స్ కి శాపంగా మారుతుందా...?

Update: 2020-08-02 05:30 GMT
టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా 'పెళ్లి చూపులు' తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' అంటూ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. ఈ క్రమంలో 'ఫలక్‌ నుమా దాస్' సినిమాతో నటుడిగా మారి అందర్నీ షాక్ కి గురి చేసాడు. అంతేకాకుండా 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో హీరో అయిపోయాడు. ఇక 'నేను మీకు చెప్తా' అనే షో తో హోస్ట్ అవతారమెత్తాడు తరుణ్ భాస్కర్. ద‌ర్శ‌కుడిగా.. ర‌చ‌యిత‌గా.. నటుడిగా.. మంచి గుర్తింపును సొంతం చేసుకున్న త‌రుణ్‌ భాస్క‌ర్ ఓ వెబ్ సిరీస్ కోసం సింగర్ అవతారం కూడా ఎత్తాడు. ఇలా మల్టీ టాలెంట్స్ అన్నీ బయటకి తీస్తున్న తరుణ్ భాస్కర్ లేటెస్టుగా 'బిన్జ్ ఇట్' అనే ఓ యాప్ ని డిజైన్ చేసి వదిలాడు.

కాగా తరుణ్ భాస్కర్ ఈ యాప్ గురించి చెప్తూ.. ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితులలో అందరూ ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించడంతో పాటు.. నేను ఏమి చూడాలి? నేను ఎక్కడ చూడాలి? అని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏ వెబ్ సిరీస్.. నెక్స్ట్ ఏ మూవీ చూడాలి అని వెతకడం సమస్యగా మారింది. అందుకే కొందరు లోకల్ టీమ్ తో దీనికి సొల్యూషన్ ఇవ్వడానికి ఈ యాప్ ని తీసుకొస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈ యాప్ లో మూవీ లవర్స్ కోసం మంచి కంటెంట్ ని సూచిస్తుంది.. ఏ ఓటీటీలో ఏ కంటెంట్ ఉందనేది రికమెండ్ చేస్తుంది. అంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి బెస్ట్ ఇండెక్స్ లా ఇది పని చేస్తుంది. ఇందువల్ల ఓటీటీ వ్యూయర్ షిప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓటీటీలకు ఈ యాప్ చాలా హెల్ప్ చేస్తుంది.

ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ ఇలాంటి యాప్స్ ద్వారా ఓటీటీలను సపోర్ట్ చేస్తూ థియేటర్స్ కి వ్యతిరేకంగా వర్క్ చేయడమే అవుతుంది కదా అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. థియేటర్స్ సంక్షోభంలో ఉన్న ఇలాంటి సమయంలో తరుణ్ భాస్కర్ ఇలాంటి ఓటీటీలకు అనుగుణంగా ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ని తీసుకురావడంపై ఇండస్ట్రీ ప్రముఖులు గుర్రుగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే పలువురు ఏటీటీలు అంటూ సినిమాలు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ థియేటర్స్ కి దెబ్బ పడేలా వ్యవహరిస్తుంటే.. మళ్ళీ ఇలాంటి యాప్స్ ని క్రియేట్ చేయడం థియేటర్స్ మరింత నస్టపోయేలా చేయడమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ థియేటర్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.
Tags:    

Similar News