భీమ్లా నాయక్ ని ఏపీ సర్కారు దెబ్బెయ్యదు కదా..?

Update: 2022-02-16 06:45 GMT
పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భీమ్లానాయక్‌’. కరోనా పాండమిక్ ఆంక్షలు - ఏపీలో నెలకొన్న థియేటర్‌ పరిస్థితులు - టికెట్‌ రేట్ల వ్యవహారం తదితర కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. రోజులు ఎప్పుడు ఎలా ఉంటాయో అనే ఆలోచనతో మేకర్స్ ఒకటికి రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు. కుదిరితే ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్‌ 1న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

ఏపీలో కోవిడ్ ఆంక్షలు ఎత్తేస్తే ఈ నెల 25వ తేదీనే సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు 'భీమ్లా నాయక్' నిర్మాత ఇటీవల తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆంధ్రాలో ఫిబ్రవరి 14 వరకు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించబడింది. ఆ తరువాత దాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించలేదు కాబట్టి.. ఆ నిబంధనకు కాలం చెల్లిపోయినట్లేనని అనుకోవాలి. అలా అనుకునే ఏపీలో థియేటర్లలో 100 శాతం టికెట్లు విక్రయించే ప్రక్రియ ప్రారంభించారు.

ఈరోజు నుంచి సినిమా హాళ్లలో పూర్తి స్థాయిలో టికెట్లు అమ్మడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ''భీమ్లా నాయక్'' మేకర్స్ సడెన్ గా మంగళవారం రాత్రి రిలీజ్ డేట్ పోస్టర్ వదిలారు. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కోవిడ్ ఆంక్షలు పొడగిస్తున్నట్లు ఏపీ సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో పవన్ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

నిజానికి ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ లేదని 'భీమ్లా నాయక్' సినిమా కోసం ఏప్రిల్ 1వ తేదీని బ్లాక్ చేసారు. పవన్ సినిమా లేదులే అనుకోని వరుణ్ తేజ్ 'గని' - శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఇప్పుడు భీమ్లా డేట్ రావడంతో అల్లు అరవింద్ నిర్మిస్తున్న మెగా గని వెనక్కి వెళ్లక తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఇక అదే తేదీకి రావాలని చూసిన 'సెబాస్టియన్' వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. శర్వా మాత్రం ధైర్యం చేసి బరిలో దిగుతాడని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే జనాల్లో కరోనా భయం సినిమాలు చూడటానికి థియేటర్లకు వస్తున్నారని 'డీజే టిల్లు' నిరూపించింది. కాబట్టి పవన్ సినిమా వసూళ్లకు ఎలాంటి డోకా లేదు. కాకపోతే 'భీమ్లా నాయక్' సినిమా విడుదల సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం మెలిక పెడుతుందో అని పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకముందు 'వకీల్ సాబ్' సినిమాను ఇబ్బంది పెట్టడానికే టికెట్ రేట్లు తగ్గిస్తూ జగన్ సర్కార్ జీవో తీసుకొచ్చిందని ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్ముతున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం కరోనా ఆంక్షలు ఎత్తేస్తున్నట్లు ప్రకటించకుండానే.. ఈ నెల 25న భీమ్లా నాయక్ విడుదలకు రెడీ అయిపోయింది. అప్పటికి టికెట్ రేట్ల సవరణ జీవో - ఐదో షోకు అనుమతి వస్తే అది పవన్ చిత్రానికి బోనస్ అవుతుంది. కానీ ఈ గ్యాప్ లో ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని పీకే ఫ్యాన్స్ లో సందేహాలు ఉన్నాయి. మరి రాబోయే ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రాన్ని సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ ప్లే అందించిన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇందులో పవన్‌ కల్యాణ్‌ తో పాటు రానా దగ్గుబాటి మరో కథానాయికుడి నటించారు. నిత్యామీనన్‌ - సంయుక్త మీనన్ కథానాయికలు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు కాబట్టి.. మేకర్స్ ముమ్మరంగా ప్రమోషన్స్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ట్రైలర్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అప్డేట్స్ రానున్నాయి.
Tags:    

Similar News