'ది వారియర్' పై టికెట్ రేట్లు ప్రభావం చూపుతాయా..??

Update: 2022-07-12 16:30 GMT
జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోయిన తర్వాత థియేటర్లకు రావడం తగ్గించారనేది వాస్తవం. అందులోనూ ఇటీవల కాలంలో అధిక టికెట్ ధరలు ప్రేక్షకులను ఇంకా సినిమా హాళ్లకు దూరం చేస్తున్నాయి. ఎక్కువ రేట్లు పెట్టి థియేటర్లలో సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని ఈ మధ్య రిలీజైన కొన్ని చిత్రాలను బట్టి అర్థం అవుతుంది.

ఈ విషయాన్ని గుర్తించిన ఫిలిం మేకర్స్ తమ సినిమాలను సాధారణ ధరలతో విడుదల చేయడం మొదలు పెట్టారు. హీరో అడివి శేష్ చొరవతో 'మేజర్' చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ అతి తక్కువ ధరలతో ప్రదర్శించారు. 'విరాటపర్వం' సినిమా కూడా ఇదే బాటలో నడిచింది. 'ఎఫ్ 3' మరియు 'అంటే సుందరానికి' రేట్లు మరీ తక్కువ కాకపోయినా కూడా ఓ విధంగా పర్వాలేదు. అయితే ఇప్పుడు 'ది వారియర్' సినిమా ధరలు చర్చనీయాంశంగా మారాయి.

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''ది వారియర్''. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జులై 14న తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

హైదరాబాద్ లోని కొన్ని మల్టీఫ్లెక్స్ లలో టికెట్ ధర జీఎస్టీ మినహాయించి రూ. 295 ఉంటే.. సింగిల్ స్క్రీన్ లలో రూ.175 పైనే ఉంది. ఏఎంబీ సినిమాస్ వంటి మల్టీఫ్లెక్స్ లలో ప్లాటినమ్ టికెట్లు రూ. 350 గా ఉన్నాయి. ఇవి సాధారణ ప్రేక్షకులకు అధిక ధరలనే చెప్పాలి.

బుక్ మై షోలో మెజారిటీ షోలు గ్రీన్ గా కనిపించడాన్ని బట్టి చూస్తే.. టికెట్ రేట్లు ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతాయేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయిన హీరో రామ్.. టికెట్ రేట్ల గురించి ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది.

నైజాంలో మ్యాగ్జిమమ్ టిక్కెట్ ధరలు పెట్టారు. ఇది సినిమా యొక్క ఫుల్ థియేట్రికల్ రిటర్న్ పై ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారా? మీడియా మిత్రులు రామ్ ను ప్రశ్నించారు. దానికి రామ్ బదులిస్తూ 'నాకు దాని గురించి ఎలాంటి ఐడియా లేదు. అది నా డిపార్ట్మెంట్ కాదు' అని బదులిచ్చారు.

టాలీవుడ్ ఏ సినిమా బిజినెస్ అయినా హీరోపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, హీరో తన సినిమాలోని ప్రతి అంశంలోనూ అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన టికెట్ ధరల మీద ఐడియా ఉండాలి.

అడివి శేష్ - రానా దగ్గుబాటి వంటి హీరోలు దీనిపై ఐడియా ఉండబట్టే టికెట్ రేట్లు తగ్గించడానికి చొరవ తీసుకున్నారు. కానీ రామ్ మాత్రం తన సినిమా టికెట్ రేట్లపై ఎలాంటి ఐడియా లేదని చెబుతున్నారు. ఏదేమైనా ఇటీవల కాలంలో సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ విషయంలో టికెట్ రేట్లు కీలక పాత్ర పోషిస్తాయనే దానిలో ఎలాంటి సందేహం లేదు.

RRR - 'కేజీఎఫ్ 2' లాంటి భారీ సినిమాలను ఎంత రేటు పెట్టినా చూస్తున్నారు కానీ.. మిగతా చిత్రాల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగలదడానికి టికెట్ ధరలే కారణం. మరి ఇప్పుడు 'ది వారియర్' సినిమా అలాంటి రేట్లతో ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందో చూడాలి.
Tags:    

Similar News