భార్య ప్రోత్సాహంతోనే పాట కోసం ఉద్యోగం వదిలేసిన కేకే!

Update: 2022-06-01 09:35 GMT
సాధారణంగా తమ వృత్తిని ప్రాణంగా భావించేవాళ్లంతా తమ చివరి ఊపిరి ఉన్నంతవరకూ అందులోనే కొనసాగాలని కోరుకుంటారు. తమకి ఇష్టమైన ఆ పనిని చేస్తూ కళ్లు మూయాలనే భావిస్తారు. సింగర్ కేకే విషయంలోనూ ఇదే జరిగింది. పాట తనకి తోడు .. పాటకి తాను తోడు అన్నట్టుగా ఉండే కేకే, నిన్నరాత్రి కోల్ కతాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తరువాత  ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో హోటల్ కి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని భావించారు. హోటల్ కి చేరుకున్న కొంతసేపటికే ఆయన అక్కడ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హాస్పిటల్లో చేర్పించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు స్పష్టం చేశారు.

చిత్రపరిశ్రమకి సంబంధించి సింగర్స్ మధ్య కూడా గట్టిపోటీ ఉంటుంది. ఒక సినిమాలో ఒక పాట పాడే అవకాశం ఎంతోమందిని దాటుకుని గాని రాదు.  అలా తమ వరకూ అవకాశం రావాలంటే తమలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అలాంటి ప్రత్యేకమైన వాయిస్ తో అవకాశాలను అందిపుచ్చుకున్న గాయకుడిగా కేకే కనిపిస్తారు.

ఒక్క హిందీలోనే కాదు ..అరడజను భాషలకి పైగా సినిమాల నుంచి తనని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా ఆయన చేసుకున్నారు. ఎవరు ఏ పాటనైనా పాడొచ్చు అనుకునే ఈ రోజుల్లో, ఫలానా పాట కేకే పాడితేనే బాగుంటుందని ఆయనను పిలిపించడం ఆయనలోని ప్రత్యేకతకి నిదర్శనం.

మొదటి నుంచి కూడా కేకే కి పాటలంటే ఇష్టం .. ప్రాణం. ఎప్పుడు చూసినా .. ఏ పని చేస్తున్నా పాటలు పాడుకుంటూనే ఉండేవాడు. జ్యోతి అనే యువతిని ఆయన ప్రేమించి 1991లో పెళ్లి చేసుకున్నారు. 6వ తరగతి నుంచి వాళ్లిద్దరి మధ్య పరిచయం ఉంది. కేకే కి పాటలంటే ఎంత పిచ్చి అనేది ఆమెకి తెలుసు. ఆయన తన ఇష్టాన్ని చంపుకుని కుటుంబం కోసం సేల్స్ మేన్ గా పనిచేస్తూ ఉండేవారు. తన భర్తకి ఆనందాన్ని కలిగించే పాటలని పాడుకోనీయాలని జ్యోతి భావించారు. ఉద్యోగం మానేసి సింగర్ గా ప్రయత్నించమని ఆమె ప్రోత్సహించారు.

భార్య ఇచ్చిన ధైర్యంతో కేకే ముందడుగువేశారు. ఈవెంట్స్ లో పాడుతూ .. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వెళ్లారు. అలా కొంతకాలానికి ఆయనకి అవకాశాలు రావడం .. ఆ తరువాత గుర్తింపు రావడం .. ఫలితంగా అవకాశాలు పెరగడం మొదలైంది.

అయితే డబ్భు కోసం మాత్రమే కాకుండా చివరినిమిషం వరకూ పాటకి న్యాయం చేయడానికే ఆయన ప్రయత్నించారు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతూ .. తనకి వచ్చిన క్రేజ్ ను కాపాడుకుంటూ ముందుకు వెళ్లారు. క్రమశిక్షణకు .. నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ తన కెరియర్ ను కొనసాగించారు. అలాంటి ఒక గాయకుడు ఈ లోకాన్ని వదిలివెళ్లడం అభిమానులను కదిలించి వేస్తోంది. పాటతోనే పెరిగి .. పాటతోనే ప్రయాణిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్లిన ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం!
Tags:    

Similar News